రగిలిపోతున్న చిరు, బాలయ్య ఫ్యాన్స్

సంక్రాంతి సినిమాలకు థియేటర్ల కేటాయింపు విషయంలో రెండు నెలలుగా పెద్ద చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. డబ్బింగ్ సినిమా అయినా.. డిమాండ్ తక్కువున్నా ‘వారసుడు’ సినిమాకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో, మంచి మంచి స్క్రీన్లు అట్టిపెడుతుండడం పట్ల చాలా అభ్యంతరాలే వ్యక్తమయ్యాయి.

దీని గురించి మీడియాలో ఎంత రగడ జరిగినా.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా జోక్యం చేసుకుని తెలుగు సినిమాలకే ప్రాధాన్యం దక్కాలని స్టేట్మెంట్ ఇచ్చినా దిల్ రాజు వెనక్కి తగ్గట్లేదు. ముందు రిలీజ్ డేట్ ఇచ్చాం.. సమస్య ఉంటే ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు, నేను మాట్లాడుకుంటాం.. ఇది వ్యాపారం కాబట్టి నా సినిమాకు ఎక్కువ స్క్రీన్లు ఇచ్చుకుంటే తప్పేంటి.. చివరికి దమ్మున్న సినిమానే నిలబవడుతుంది.. లాంటి వాదనలతో విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు.

కానీ ఆయన ఎంత సమర్థించుకున్నప్పటికీ.. మైత్రీ వాళ్లు మౌనం వహిస్తున్నప్పటికీ.. గ్రౌండ్ లెవెల్లో చిరు, బాలయ్య అభిమానులకు మాత్రం పరిస్థితులు రుచించడం లేదు. వైజాగ్ ఏరియాలో మూడు సంక్రాంతి సినిమాలకు సంబంధించి థియేటర్ల జాబితాతో ప్రకటనలు వెలువడగా.. అందులో ‘వారసుడు’దే స్పష్టమైన పైచేయి.

ఇప్పటిదాకా ఖరారైన జాబితాలు చూస్తే.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు కలిపి ఎన్ని స్క్రీన్లు కేటాయించారో.. ‘వారసుడు’ ఒక్క దానికే అన్ని స్క్రీన్లు ఇచ్చుకున్నారు. అందులోనూ మెలోడీ, సంగం లాంటి మంచి మంచి స్క్రీన్లు ‘వారసుడు’కు ఇవ్వడం.. చిరు, బాలయ్య సినిమాలకు ప్రాధాన్యం తగ్గించడం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

ఇది ఎంత వ్యాపారం అన్నా సరే.. భారీ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న చిరు, బాలయ్య సినిమాలకు కాదని.. డిమాండ్ లేని తమిళ అనువాద చిత్రానికి సంక్రాంతి టైంలో ఎక్కువ సంఖ్య, మంచి మంచి స్క్రీన్లు ఇవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీకెండ్ వరకు ఇలా కేటాయించిన స్క్రీన్లలోనే ఆయా సినిమాలను నడిపిస్తే అంతకంటే అన్యాయం ఉండదని మండిపడుతున్నారు.