నంబ‌ర్ వ‌న్ వివాదంపై Dil Raju క్లారిటీ

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మధ్య త‌ర‌చుగా వివాదాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్నాడు. త‌న నిర్మాణంలో వ‌స్తున్న త‌మిళ అనువాద చిత్రం వార‌సుడుకు థియేట‌ర్ల కేటాయింపు విష‌యంలో Dil Raju ఎంత వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నాడో తెలిసిందే.

ఆ గొడ‌వ చాల‌ద‌న్న‌ట్లు ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. త‌మిళంలో విజ‌యే నంబ‌ర్ వ‌న్ హీరో అని, అజిత్ మూవీ తునివుతో పోలిస్తే విజ‌య్ మూవీ వారిసుకు ఎక్కువ థియేట‌ర్లు ఇవ్వాల‌ని రాజు పేర్కొన‌డం దుమారం రేపింది.

ఇది అజిత్ అభిమానుల‌కు అస్స‌లు రుచించ‌లేదు ఈ విష‌య‌మై విజ‌య్, అజిత్ అభిమానుల మ‌ధ్య సోష‌ల్ మీడియాలో వేదిక‌గా కొన్ని రోజుల పాటు గొడ‌వ న‌డిచింది. ఈ వివాదానికి కేంద్ర‌మైన Dil Raju.. తాజాగా త‌న స్టేట్మెంట్ మీద మ‌రో ఇంట‌ర్వ్యూలో వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు.

విజ‌య్ త‌మిళంలో నంబ‌ర్ వ‌న్ హీరో అనే మాట‌కు తాను క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు రాజు తెలిపాడు. ఒక హీరో స్టార్ ప‌వ‌ర్ ఏంట‌న్న‌ది థియేట్రిక‌ల్ రెవెన్యూను బట్టే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని.. ఈ కోణంలో త‌మిళంలో విజ‌యే నంబ‌ర్ వ‌న్ హీరో అని రాజు అన్నాడు.

విజ‌య్ న‌టించిన గ‌త అయిదారు సినిమాలు టాక్‌, రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా త‌మిళ‌నాట మినిమం రూ.60 కోట్ల షేర్ రాబ‌ట్టాయ‌ని.. ఈ రికార్డు త‌మిళంలో ఇంకెవ‌రికీ లేద‌ని.. అందుకే అక్క‌డున్న అంద‌రు హీరోల‌కంటే విజ‌య్ బిగ్ స్టార్ అన్న‌ది త‌న అభిప్రాయ‌మ‌ని Dil Raju స్ప‌ష్టం చేశాడు.

వార‌సుడు సినిమాకు తెలుగులో థియేట‌ర్ల కేటాయింపుపై త‌లెత్తిన వివాదం గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాను నిర్మించిన తాను, తీసిన వంశీ తెలుగు వాళ్లే అని.. ఈ రోజుల్లో అస‌లు తెలుగు, త‌మిళం అన్న తేడాలేమున్నాయ‌ని.. అన్ని సినిమాలూ పాన్ ఇండియా రేంజికి వెళ్లాయ‌ని రాజు పేర్కొన్నాడు.