కల్ట్ దర్శకుడికి కొత్త సినిమా షాకు

ఒకప్పుడు యూత్ స్టార్ గా వెలిగిన ఉదయ్ కిరణ్ మన మధ్య లేడు కానీ తన సినిమాల ద్వారా నిత్యం టీవీలో పలకరిస్తూనే ఉంటాడు. వాటిలో ఆణిముత్యం అనదగ్గ చిత్రం మనసంతా నువ్వే. కమర్షియల్ మసాలాలు రాజ్యమేలుతున్న ట్రెండ్ లో నిర్మాత ఎంఎస్ రాజు చేసిన ఈ బడ్జెట్ ప్రయోగం అద్భుత ఫలితాలను ఇచ్చింది. ఆర్పి పట్నాయక్ సంగీతం యువతను మాములుగా ఊపేయలేదు. ఆ దశాబ్దపు బెస్ట్ ఆల్బమ్స్ లో దీని చోటు పదిలంగానే ఉంటుంది. అలాంటి క్లాసిక్ ఇచ్చిన దర్శకుడు విఎన్ ఆదిత్య. డెబ్యూతోనే ఇంత గొప్ప హిట్టు అందుకోవడమంటే చిన్న విషయం కాదు. అప్పట్లో దీని సక్సెస్ హాట్ టాపిక్.

ఇది ఎంత పెద్ద విజయమంటే నాగార్జున పిలిచి మరీ నేనున్నాను అవకాశం ఇచ్చేటంత. అదీ హిట్టు కొట్టడంతో మరో ఆఫర్ బాస్ రూపంలో ఇస్తే అది నిరాశ కలిగించింది. సిద్దార్థ్ తో ఆట ఓ మాదిరిగా ఆడాక విఎన్ ఆదిత్య పూర్తిగా ఫామ్ కోల్పోయారు. 2011లో డి రామానాయుడు గారు తీసిన ముగ్గురు డిజాస్టర్ తర్వాత మళ్ళీ కనిపించలేదు. పదేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చారు. అందులో భాగంగా తీసిందే వాళ్లిద్దరి మధ్య. నిర్మాణం ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ లవ్ స్టోరీ పలుమార్లు థియేటర్ రిలీజ్ కోసం ట్రై చేసినా సాధ్యం కాకపోవడంతో నేరుగా ఓటిటి రూటు పట్టి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బ్యాడ్ లక్ ఏంటంటే ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినా దాన్ని ఎంగేజింగ్ గా ఆసక్తికరంగా చూపించడంలో ఆదిత్య తడబడ్డారు. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఈగోల సమస్యను బ్యాక్ గ్రౌండ్ గా తీసుకున్న ఆదిత్య కథనాన్ని డల్ గా కొనసాగించడంతో ఏ దశలోనూ మెప్పించలేక ఎక్కువగా ఫార్వార్డ్ బటన్ కు పని కల్పించారు. పరిచయం లేని క్యాస్టింగ్ తో తీస్తున్నప్పుడు కంటెంట్ తో మెప్పించడం చాలా కీలకం. అయితే పేలవమైన స్క్రీన్ ప్లేతో దాన్ని నీరుగార్చేశారు. హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ రైటింగ్ టీమ్ లో ఉన్న విఎన్ ఆదిత్యకు ఈ వాళ్లద్దరి మధ్య ఫలితం షాకే.