దిల్ రాజును వాయించేస్తున్నారుగా..

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మధ్య ఎన్నడూ లేని విధంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోతున్నారు. ముఖ్యంగా తన ప్రొడక్షన్లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘వారిసు’కు థియేటర్ల కేటాయింపు విషయంలో ఆయన విమర్శల పాలవుతున్నారు. పండక్కి తెలుగు చిత్రాలను కాదని తమిళ సినిమాలకు థియేటర్లు ఎలా ఇస్తాం అన్న గత కామెంట్‌కు విరుద్ధంగా ‘వారసుడు’కు స్క్రీన్లు అట్టిపెడుతున్న ఆయన.. దాని గురించి తర్వాత ఇచ్చిన వివరణ కూడా అంత సహేతుకంగా అనిపించలేదు.

ఐతే టాలీవుడ్లో రాజు పవర్ ఏంటో తెలిసిందే కాబట్టి ఇక్కడ ఆయన ఏం చేసినా.. ఏం మాట్లాడినా చెల్లిపోతుంది. కానీ తమిళంలో విజయ్, అజిత్ అభిమానుల మధ్య ఉండే గొడవల గురించి ఆలోచించకుండా అక్కడ విజయే నంబర్ వన్ హీరో, ఆయన సినిమాకే ఎక్కువ థియేటర్లివ్వాలి అంటూ రాజు ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు కోలీవుడ్లో పెద్ద చర్చకే దారితీసింది. తన ఇంటర్వ్యూ పూర్తిగా చూడకుండా చిన్న బిట్ పట్టుకుని మీడియా వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారంటూ నింద వాళ్ల మీద తోసేయడానికి రాజు ప్రయత్నించారు.

కానీ ‘‘తమిళంలో విజయ్ నంబర్ వన్ హీరో. ఆయన సినిమాకు ఎక్కువ థియేటర్లివ్వాలి’’ అని రాజు స్పష్టంగా చెప్పడం వాస్తవం. దీన్ని రాజు ఖండించలేడు. ఇందులో కొత్తగా మీడియా దుష్ప్రచారం చేయడానికి ఏముంది? ఈ కామెంట్ తమిళనాట అజిత్ అభిమానులకు గట్టిగానే తాకినట్లుంది. వాళ్ల దృష్టిలో రాజు పెద్ద విలన్ అయిపోయాడు.

అజిత్ అభిమానులను ఉడికించడానికే అన్నట్లు రాజు వీడియోను విజయ్ అభిమానులు వైరల్ చేస్తూ.. తమ హీరోనే నంబర్ వన్ అని కామెంట్లు చేస్తున్నారు. దీంతో అజిత్ అభిమానుల ఆగ్రహం ఇంకా పెరిగి దిల్ రాజును టార్గెట్ చేస్తున్నారు. ఈ వ్యవహారం కోలీవుడ్ క్రిటిక్స్, పీఆర్వోల్లో చర్చకు దారి తీసింది. వాళ్లు రెండు వర్గాలుగా విడిపోయి విజయ్‌కి, అజిత్‌కు మద్దతుగా ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు పోస్టులు పెడుతున్నారు. బాక్సాఫీస్ నంబర్లు ఇస్తున్నారు. దీంతో పాటు ఎవరు నంబర్ వన్ అంటూ పోల్స్ కూడా పెడుతుండడం.. దీని వల్ల విజయ్, అజిత్ అభిమాను మధ్య ఘర్షణ ఇంకా పెరుగుతుండడం గమనార్హం.