పూరి ‘గుడ్ సిటిజన్’ ఐడియా అదిరిపోలా

ఒకప్పటి పూరి జగన్నాథ్ సినిమాల్లో మిగతా విషయాలన్నీ ఒకెత్తయితే.. యూత్‌కు సూటిగా తాకే ఆయన మార్కు ఫిలసాఫికల్ డైలాగులు మరో ఎత్తు. ‘బిజినెస్ మ్యాన్’ లాంటి సినిమాల్లో ఆయన రాసిన ఈ తరహా డైలాగులు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. ఐతే తర్వాత తర్వాత ఆయన సినిమాల్లో బాగా పదును తగ్గింది. కానీ ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పాడ్ కాస్ట్‌లో పూరి చెప్పిన జీవిత పాఠాలు చాలామందిని టచ్ చేశాయి. ఒకప్పటి పూరి సినిమాలను మించిన షార్ప్‌నెస్ వాటిలో కనిపించింది.

‘లైగర్’ సినిమాతో బిజీగా ఉండి కొంత కాలం ఈ పాడ్‌కాస్ట్‌లకు విరామం ఇచ్చిన పూరి.. ఇటీవలే వాటిని పున:ప్రారంభించాడు. రీఎంట్రీ తర్వాత ‘తడ్కా’ అనే కాన్సెప్ట్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్రీ ఇచ్చిన పూరి.. తాజాగా ‘గుడ్ సిటిజన్’ అనే వెరైటీ కాన్సెప్ట్‌తో శ్రోతల ముందుకు వచ్చారు. దాని గురించి పూరి తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ప్రభుత్వాలకు ఒక పథకం లాంటిది సజెస్ట్ చేశారు.

పూరి చెప్పిన ‘గుడ్ సిటిజన్’ ఐడియా సింపుల్. సమాజంలో బాధ్యాతయుతంగా మెలుగుతూ, మంచి పనులు చేసే వారిని, అందరికీ సాయపడేవారిని ప్రభుత్వాలు గుర్తించి వారికి ‘గుడ్ సిటిజన్’ కార్డులు ఇవ్వాలి. ఈ ప్రక్రియ జెన్యూన్‌గా సాగాలి. ఇందుకోసం ఒక వ్యవస్థ ఉండాలి. ఇలా ‘గుడ్ సిటిజన్’ గుర్తింపు పొందిన వారికి బస్సులు, రైళ్లలో రాయితీలు.. పన్ను మినహాయింపులు ఇవ్వాలి. అలాగే వారి పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. ఈ ప్రాసెస్ జెన్యూన్‌గా జరిగితే ఒకరిని చూసి ఒకరు ఉత్తమ పౌరులుగా తయారవుతారని.. అప్పుడు దేశం ఎంతో బాగు పడుతుందని పూరి అభిప్రాయపడ్డాడు.

దీనికి వేల కోట్ల రూపాయలేమీ ఖర్చు కావని.. తక్కువ ఖర్చుతోనే ఈ ప్రక్రియను కొనసాగించవచ్చని పూరి తెలిపాడు. మనుషులు బాధ్యతాయుతంగా ఉంటే సమాజం చాలా బాగుపడుతుందని, దాని వల్ల దేశం ముందుకు వెళ్లుందని.. ఏదో ఒక రోజు మన దేశం ఈ పద్ధతిని ప్రవేశ పెడుతుందన్నది తన కోరిక అని పూరి అన్నాడు. ఏదైనా దేశంలో ఈ కాన్సెప్ట్ ఉందని తెలిసి పూరి ఇలా చెప్పాడో ఏమో తెలియదు కానీ.. ఆయన ఐడియా చాలా బాగుందంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.