ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అంట.. ఈ సామెత చందంలోనే ఉన్నాయి. మహేష్ బాబు-రాజమౌళి సినిమాకు సంబంధించి కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు. ఈ క్రేజీ కాంబినేషన్ ఓకే అయిన నాటి నుంచి తరచుగా ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది.
ఈ చిత్రం కోసం తాము స్క్రిప్టు మీద పూర్తి స్థాయిలో కూర్చున్నదే రెండు నెలల కిందట అని రాజమౌళి ఇటీవల వెల్లడించడం తెలిసిందే. కానీ నాలుగైదు నెలల ముందే ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నాడంటూ ఒక హాలీవుడ్ నటుడి పేరు ప్రచారంలోకి వచ్చింది. అసలు కథ తయారీనే మొదలు కాకుండా ఆర్టిస్టును ఎలా ఖరారు చేస్తారన్నది అర్థం కాని విషయమే. ఇప్పటికీ కథా చర్చలు ఒక కొలిక్కి రాలేదు. కానీ ఈ సినిమాలో తారాగణం గురించి మళ్లీ ఊహాగానాలు జోరందుకున్నాయి. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు మసాలా కలిపేస్తున్నారు.
మహేష్-రాజమౌళి సినిమాలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర చేయబోతున్నాడన్నది తాజాగా, కొంచెం గట్టిగా వినిపిస్తున్న రూమర్. సినిమాలో హీరో తండ్రి పాత్ర కీలకం అని.. ఆ పాత్రకు అమితాబ్ బచ్చన్‌ను సంప్రదిస్తున్నారని.. రాజమౌళి సినిమా కాబట్టి ఆయన కూడా ఓకే చెప్పే అవకాశాలున్నాయని ప్రచారం చేసేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ భామే అయిన దీపికా పదుకొనే ఖరారైనట్లు కూడా ఇంకో రూమర్ వినిపిస్తోంది.
కథ ఇంకా ప్రాథమిక దశలోనే ఉండగా పాత్రలు ఎలా ఖరారవుతాయి.. వాటికి నటీనటులను ఎంపిక చేసే పని ఎలా మొదలవుతుంది అన్నది సందేహం. అయినా ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికే ఇంకో ఏడాది పట్టేలా ఉంది. అప్పటి పరిస్థితి ఏంటో తెలియకుండా ఇప్పుడే ఎవరైనా డేట్లు చూసుకోకుండా సినిమాకు ఓకే చెబుతారా? ఇవేవీ ఆలోచించకుండా ఇలా పులిహోర కలిపేస్తుండడం ఆశ్చర్యం.