ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల దృష్టి ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ చిత్రం వీరసింహారెడ్డి మీదే ఉండబోతోందన్నది స్పష్టం. వీటికి తోడు విజయ్ అనువాద చిత్రం వారసుడు కూడా పెద్ద స్థాయిలోనే రిలీజ్ కాబోతోంది. అందుక్కారణం ఆ చిత్రాన్ని నిర్మించింది టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కావడమే. దీని దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా తెలుగువాడేనన్న సంగతి తెలిసిందే.
మెజారిటీ థియేటర్లను ఈ మూడు చిత్రాలను పంచుకుంటే.. మరో అనువాద చిత్రం తునివు నామమాత్రంగా రిలీజవుతుందని అనుకున్నారంతా. అజిత్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఐతే తెలుగు రాష్ట్రాల్లో మిగతా మూడు సంక్రాంతి సినిమాలకు లేని అడ్వాంటేజ్ అజిత్ సినిమాకు దక్కబోతుండడం విశేషం.
సంక్రాంతికి పోటీయే లేకుండా సోలోగా ఒక్క రోజంతా బ్యాటింగ్ చేయబోతున్న సినిమా తునివు మాత్రమే. ఈ చిత్రం జనవరి 11, బుధవారం రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాతి రోజు వీరసింహారెడ్డి, వారసుడు విడుదలవుతాయి. 13న వాల్తేరు వీరయ్య రాబోతోంది. సంక్రాంతికి భారీ పోటీ ఉండడంతో ముందు వారం ఎలాగూ చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కావు. థియేటర్లన్నీ ఖాళీగా ఉంటాయి. కాబట్టి 11న రిలీజయ్యే తునివు చిత్రానికి కావాల్సినన్ని థియేటర్లు, షోలు దక్కుతాయి.
సినిమాకు టాక్ బాగుండాలే కానీ.. వసూళ్లు కుమ్మేసుకోవచ్చు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు కూడా తక్కువగా, రూ.3 కోట్లకే ఇచ్చినట్లు సమాచారం. కాబట్టి మంచి ట్రైలర్ వదిలి హైప్ తీసుకురాగలిగితే, డే-1 పెద్ద సంఖ్యలో థియేటర్లు దక్కుతాయి కాబట్టి రికవరీ చాలా ఈజీనే అవుతుంది.