మూఢనమ్మకాల మీద విరూపాక్ష యుద్ధం

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ జరిగి పూర్తిగా కోలుకున్నాక షూటింగ్ లో పాల్గొన్న సినిమాకు విరూపాక్ష టైటిల్ ని లాక్ చేశారు. ఇది ముందే లీకైనప్పటికీ అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. రిపబ్లిక్ లో మంచి కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ ఆడియన్స్ ని మెప్పించడంతో దేవ కట్టా ఫెయిలవ్వడంతో సాయి ధరమ్ తేజ్ మరో విభిన్న అంశంతో వస్తున్నాడు. పల్లెటూళ్ళలో ఉండే మూఢనమ్మకాలు, బ్లాక్ మేజిక్ అంటే చేతబడి లాంటి వ్యవహారాలు, జనంలో ఉండే అజ్ఞానం భయం తాలూకు పరిణామాల నేపథ్యంలో దర్శకుడు కార్తీక్ దండు ఇందులో చూపించబోతున్నాడు. సుకుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చడం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

విరూపాక్షలో తీసుకున్న బ్యాక్ డ్రాప్ ఆసక్తి కలిగించేలా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో అది పర్ఫెక్ట్ గా ఎలివేట్ అయ్యింది. సాధారణంగా ఇలాంటి కథలు బాలీవుడ్ వెబ్ సిరీస్ లో ఎక్కువగా వస్తుంటాయి. మన దర్శకులెవరూ ఇలాంటివి ట్రై చేసిన దాఖలాలు చాలా తక్కువ. ఇటీవలే వచ్చిన మసూదలోనూ దీనికి సంబంధించిన పాయింట్ తీసుకుని హారర్ లవర్స్ ని మెప్పించారు. కానీ సాయి ధరమ్ తో పూర్తిగా దెయ్యాలు భూతాలను డీల్ చేయలేరు కాబట్టి కమర్షియల్ కోటింగ్ ని జోడించి తన ఇమేజ్ కి తగ్గట్టు సెట్ చేశారు. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శామ్ దత్ ఛాయాగ్రహణం టెక్నికల్ గా తోడ్పడనున్నాయి.

విడుదల తేదీని 2023 ఏప్రిల్ 21కి ముందస్తుగా లాక్ చేశారు. ప్రస్తుతానికి ఆ డేట్ కి ఎలాంటి క్లాష్ లేదు. అదే నెల 14న చిరంజీవి భోళా శంకర్, రజినీకాంత్ జైలర్ లు వస్తున్నాయి. ఒకవేళ శాకుంతలం ఫిబ్రవరిలో రాకపోతే ఈ టైంలోనే వచ్చే అవకాశం లేకపోలేదు. మొత్తానికి గ్యాప్ తీసుకున్న సుప్రీమ్ హీరోకి సరైన సినిమానే తగిలింది. మూస ప్రేమకథలు, సూట్ కానీ ఓవర్ ఎలివేషన్ల మసాలా సినిమాలు కాకుండా ఇలా విరూపాక్ష లాంటి జానర్ ని ఎంచుకోవడం మంచి ప్రయత్నమే. బయట ప్రపంచానికి అంతగా తెలియని రహస్య ప్రదేశం లాంటి గ్రామంలో జరిగే కథే ఈ విరూపాక్షని తెలిసింది.