పూనమ్ కౌర్‌కు ఏమైంది?

ఈ మధ్యే టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అనారోగ్యం గురించి తెలిసి అందరూ షాకైపోయారు. తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డ విషయాన్ని సమంతే స్వయంగా వెల్లడించింది. ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోయిన్ అనారోగ్యం గురించి సమాచారం బయటికి వచ్చింది. ఆమే.. పూనమ్ కౌర్. సమంత లాగే పూనమ్ సైతం అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు వెల్లడైంది. ఆ వ్యాధి పేరు.. ఫైబ్రో మయోల్జియా. నిద్ర లేమి, కండరాల నొప్పులు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తడం ఈ వ్యాధి లక్షణాలట.

పూనమ్ కౌర్‌కు ఫైబ్రో మయోల్జియా ఉన్నట్లుగా నవంబరు 18న నిర్ధారణ అయినట్లు సమాచారం. అప్పటి నుంచి కొంత కాలం అలోపతీలోనే చికిత్స తీసుకున్న పూనమ్.. తర్వాత కేరళలోని ఓ ఆయుర్వేద ఆసుపత్రిలో చేరింది. కొన్ని రోజుల అనంతరం పుణెకు చేరుకుని అక్కడ తన సోదరి ఇంట్లో విశ్రాంతి పొందుతున్నట్లు తెలుస్తోంది. పూనమ్ ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నట్లుగా ఆమె టీం మీడియాకు సమాచారం ఇచ్చింది. సమంత సైతం కొంత కాలం అలోపతీ చికిత్స తర్వాత కేరళకు వెళ్లి ఆయుర్వేద పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకోగా ఉపశమనం వచ్చినట్లు మీడియాలో వార్తలు రావడం తెలిసిందే.

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘మాయాజాలం’తో పూనమ్ టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత వినాయకుడు, గగనం, శ్రీనివాస కళ్యాణం సహా పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసింది. హీరోయిన్‌గానే కాక క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఆమె క్లిక్ కాలేకపోయింది. ఐతే పూనమ్ వ్యక్తిగత జీవితం తాలూకు పలు విషయాలు తరచుగా చర్చనీయాంశం అవుతుంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో ఆమె పేరును ముడిపెట్టి అనేక వివాదాలు తలెత్తాయి. ఇటవల ఆమె రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తర్వాత మళ్లీ అనారోగ్య సమస్యతో వార్తల్లోకి వచ్చింది.