హిట్ 2కి అదొక్కటే తలనొప్పి

క్రైమ్ థ్రిల్లర్స్ కి చివర్లో వచ్చే ట్విస్టు చాలా కీలకం. ఇవన్నీ మర్డర్స్ చుట్టూ తిరిగే కథలు కాబట్టి హంతకుడు ఎవరనేది ఎంత తెలివిగా దర్శకుడు దాచి పెడతాడనే దాని మీద సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం వంశీ తీసిన అన్వేషణలో సినిమా ఇంకో అయిదు నిమిషాల్లో ముగుస్తుందనగా ఎవరూ ఊహించని విధంగా రాళ్ళపల్లి విలనని తెలిసి ప్రేక్షకులు షాక్ అవుతారు. ఆ చిత్రం విజయంలో ఈ మలుపు చాలా కీలకంగా పని చేసింది. వెంకటేష్ ప్రేమ మూవీలో దీనికి సంబంధించిన థియేటర్ సన్నివేశం బాగా పేలింది. ఆ తర్వాత ఇలాంటివి చాలానే వచ్చాయి.

ప్రస్తుతానికి వస్తే హిట్ 2 టీమ్ కి సోషల్ మీడియా స్పాయిలర్స్ పెద్ద తలనెప్పిగా మారాయి. విడుదలకు ముందే ట్రైలర్ ని డీ కోడ్ చేసి ఫలానా ఆర్టిస్ట్ సైకో అని ఫలానా నటే కిల్లరని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లీకులు మొదలుపెట్టారు. దెబ్బకు అడవి శేష్ స్వయంగా రంగంలోకి దిగి అవేవి నిజం కాదని కొంత ఓపిక పట్టమని వీడియో రూపంలో వేడుకోవాల్సి వచ్చింది. ఇదంతా ఎంత కంట్రోల్ చేసినా ఉదయం షోలు అయ్యేంత వరకే. ఒక్కసారి అవి పూర్తయ్యాక వీటిని ఆపడం చాలా కష్టం. హిట్ 1కి ఇప్పటికి టెక్నాలజీలో తీవ్ర మార్పులేమీ రాకపోయినా వాడకందారులు మాత్రం పెరిగిపోయారు.

వీటిని మేనేజ్ చేసుకోవడం పెద్ద సవాలే. పైరసీ అయితే సైబర్ సెల్ కి ఫిర్యాదు చేసి తీయించొచ్చు కానీ ఫలానా సినిమాలో ఫలానా సీన్ ఉందని చెప్పే వాళ్ళను ఆపేదెవరు. ఇది నైతికతకు సంబంధించిన అంశం. ఎవరికి వాళ్ళు తాము చేస్తున్నది రైటా రాంగా గుర్తించి మసలుకోవాలే తప్ప ఇంకొకరి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని చంపే హక్కు లేదు. శేష్ చెబుతున్నది కూడా అదే. హిట్ 1కి ఇంత సమస్య రాలేదు కానీ సీక్వెల్ కి మాత్రం చిక్కులు తప్పలేదు. మేజర్ బ్రాండ్ బాగా పని చేయడంతో హిట్ 2 బుకింగ్స్ బాగున్నాయి. టాక్ కనక స్టడీగా నిలబడితే అవతార్ 2 వచ్చే దాకా దున్నేసుకోవచ్చు.