ఇప్పుడున్న సోషల్ మీడియా ట్రెండ్ లో రీమేకులతో పెద్ద చిక్కొచ్చి పడింది. అసలు భాష నిర్మాత నుంచి హక్కులు కొని, క్యాస్టింగ్ సెట్ చేసుకుని, షూటింగ్ గట్రా పూర్తి చేసేసి థియేటర్లోకి తెచ్చేలోపు దాని ఒరిజినల్ వెర్షన్ ని థియేటర్లోనో లేదా ఓటిటిలోనో చూసేసి విపరీతమైన పోలికల హడావుడి చేసే బ్యాచ్ ఎక్కువైపోయింది. గాడ్ ఫాదర్ రిలీజ్ కు దగ్గర్లో ఉన్నప్పుడు మోహన్ లాల్ లూసిఫర్ తో కంపారిజన్లు తెస్తూ ఇతర హీరోల అభిమానులు చేసిన ట్రోలింగ్ చాలానే ఉంది. భీమ్లా నాయక్ టైంలోనూ అయ్యప్పనుం కోషియంని అప్పటికప్పుడు చూసి మీమ్స్ తయారు చేసిన ట్విట్టర్ హ్యాండిల్స్ లెక్కలేనన్ని ఉన్నాయి.
మ్యాటర్ ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన అల వైకుంఠపురములో హిందీ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. 2023 ఫిబ్రవరి రిలీజ్ కు గ్రౌండ్ రెడీ చేస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న టీజర్ వదిలారు. టైటిల్ షెహజాదా. కార్తీక్ ఆర్యన్ లుక్స్ పట్ల ఇంటా బయటా మిశ్రమ స్పందన దక్కుతోంది. బన్నీ స్టైలింగ్, ఎనర్జీ ముందు ఇతగాడు తేలిపోయాడని పైగా గుర్రంతో ఎంట్రీ ఇవ్వడాలు, క్లైమాక్స్ ని మెట్రో స్టేషన్ లో సెట్ చేయడాలు లాంటివి ఫీల్ ని తగ్గించాయననే ఫీడ్ బ్యాక్ వినిపిస్తోంది
అసలు కథకు ఎలాంటి మార్పులు చేయకపోయినా యాక్షన్ ఎపిసోడ్లు మాత్రం వేరే స్టైల్ ట్రై చేసినట్టు ఉన్నారు. నిజానికి అల వైకుంఠపురములో హిందీ డబ్బింగ్ ని నార్త్ ఆడియన్స్ ఎప్పుడో చూసేశారు. వాళ్లకు ఈ షెహజాదాలో ఎలాంటి కొత్తదనం కనిపించదు క్యాస్టింగ్ తప్ప. పైగా తమన్ ని మ్యాచ్ చేసే స్థాయిలో ఇందులో మ్యూజిక్ ఉండటం అనుమానమే. ఆది పురుష్ ఫేమ్ కృతి సనన్ హీరోయిన్ గా చేసింది కానీ పూజా హెగ్డే ఇచ్చిన క్యూట్ నెస్ తనలో కనిపించలేదు. మొత్తానికి ఈ షెహజాదా ఖంగాళీ చేశాడా లేకా మ్యాచ్ చేశాడానేది ఇంకో మూడు నెలల్లో అంటే ఫిబ్రవరి 10న తేలనుంది.