ఆశ చావని వర్మ

ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇటు టాలీవుడ్లో, అటు బాలీవుడ్లో ఎలాంటి వైభవం చూశాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో టాప్ స్టార్లు ఆయనతో సినిమాలు చేయడానికి తహతహలాడేవారు. కానీ స్టార్లతో జట్టు కట్టకపోయినా కేవలం వర్మ సినిమా అంటే చాలు థియేటర్లకు పరుగులు పెట్టేవాళ్లు ప్రేక్షకులు.

కానీ ఇప్పుడు చిన్న స్థాయి ఆర్టిస్టులు కూడా వర్మ సినిమాల్లో నటించడానికి భయపడుతున్నారు. ఇక ప్రేక్షకులేమో వర్మ సినిమాలంటే బెంబేలెత్తిపోతున్నారు. వర్మ సినిమా రిలీజవుతుంటే ఒక వంద టికెట్లు తెగడం కూడా కష్టమవుతోంది. ‘రక్త చరిత్ర’ స్టయిల్లో వయొలెంట్ రియల్ స్టోరీలు తీసినా.. హాట్ హీరోయిన్లను పెట్టి ఎరోటిక్ మూవీస్ తీసినా.. రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేస్తూ సెటైరికల్ మూవీస్ తీసినా.. ఇలా ఏం చేసినా ఫలితం ఉండట్లేదు. పబ్లిసిటీ గిమ్మిక్కులు తప్ప వర్మ సినిమాల్లో విషయం ఉండట్లేదని బలంగా ఫిక్సయిపోయిన ఆడియన్స్ ఆయన సినిమాలను అసలేమాత్రం పట్టించుకోవడం లేదు.

వర్మ సినిమాలకు కనీసం ఐదో పదో థియేటర్లు దొరకడం కూడా కష్టమైపోతోంది. వర్మ ఆస్థాన హీరోయిన్లుగా మారిన నైనా గంగూలీ, అప్సరా రాణిలను పెట్టి వర్మ ‘డేంజరస్’ అనే సినిమా ఒకటి తీసిన సంగతి తెలిసిందే. ఇది ఇద్దరు లెస్బియన్ల మధ్య నడిచే కథ. ఇద్దరు హీరోయిన్ల అందాలను ఏ రేంజిలో ఉపయోగించుకోవాలంటూ ఆ రేంజిలో వాడుకున్నాడు వర్మ. కానీ కనీసం కుర్రాళ్లను కూడా ఆ సినిమా వైపు ఆకర్షించలేకపోతున్నాడు.

ఇంతకుముందు సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తే థియేటర్లు దొరకలేదు. డిస్ట్రిబ్యూటర్లెవరూ సినిమాను కొనడానికి ముందుకు రాలేదు. దీంతో వాయిదా వేయక తప్పలేదు. తర్వాత కూడా కొన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. సినిమాను ఓటీటీలకు ఇద్దామన్నా ఎవరూ తీసుకోవడం లేదో ఏమో.. కొంత కాలం ఆ చిత్రాన్ని పక్కన పెట్టేశాడు వర్మ. మళ్లీ ఇప్పుడు దాన్ని బయటికి తీశాడు. కొత్తగా ట్రైలర్ అంటున్నాడు. డిసెంబరులో రిలీజ్ అని హడావుడి చేస్తున్నాడు. ఎప్పట్లాగే ఎరోటిక్ పోస్టర్లు దించుతున్నాడు. కానీ ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. వర్మ ఎన్ని గిమ్మిక్కులు చేసినా చిల్లర కూడా రాలేలా లేదు.