తెలుగు సినిమాలకు కొత్తగా మార్కెట్ ఏర్పడుతున్న దేశం జపాన్. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కొన్ని అక్కడ బాగా ఆడాయి. ఇక మన సినిమాలకు పెద్ద మార్కెట్ క్రియేట్ చేసిన సినిమా అంటే ‘బాహుబలి’నే. ఆ సినిమా అక్కడ సంచలన వసూళ్లు రాబట్టింది. జపాన్‌లో రజినీ సినిమా ‘ముత్తు’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా ‘బాహుబలి’ రికార్డు నెలకొల్పింది.
ఆ చిత్రం ఫుల్ రన్లో 360 మిలియన్ యాన్‌లు కలెక్ట్ చేసింది. ఐతే ‘ముత్తు’ సినిమా 90ల్లోనే 400 మిలియన్ యాన్‌లతో రికార్డు నెలకొల్పింది. దాన్ని ఏ చిత్రమూ అధిగమించలేదు. ఐతే రాజమౌళి కొత్త చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఆ రికార్డు మీద కన్నేసినట్లే కనిపిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ను రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి జపాన్‌లో గట్టిగా ప్రమోట్ చేశారు. వేరే రకమైన పబ్లిసిటీ కూడా గట్టిగా జరిగింది. సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.
విడుదలైన తొలి వారంలోనే 75 మిలియన్ యాన్‌ల వసూళ్లతో ఆశ్చర్యపరిచింది ‘ఆర్ఆర్ఆర్’. తర్వాతి మూడు వారాల్లోనూ సినిమా జోరేమీ తగ్గలేదు నాలుగు వారాలు ముగిసేసరికి ‘ఆర్ఆర్ఆర్’ 250 మిలియన్ యాన్‌ల వసూళ్లు రాబట్టడం విశేషం. ‘బాహుబలి’ సినిమా 250 మిలియన్ యాన్‌ల మార్కును అందుకోవడానికి 36 వారాలు పట్టడం గమనార్హం.
అంతటి వసూళ్లను ‘ఆర్ఆర్ఆర్’ నాలుగు వారాల్లోనే అందుకుందంటే ఈ సినిమా జపాన్‌లో ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తోందో అర్తం చేసుకోవచ్చు. జపాన్‌లో మన లాగా సినిమాల థియేట్రికల్ రన్ రెండు మూడు వారాలకు పరిమితం కాదు.
రెండు దశాబ్దాల ముందు మన దగ్గర 50-100-175 రోజులు ఆడిన పరిస్థితులే ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ థియేట్రికల్ రన్ ఇంతటితో ముగిసిపోదు. అది ఇంకో రెండు మూడు నెలల పాటు బాగా ఆడేలానే ఉంది. కాబట్టి ‘ముత్తు’ రికార్డు బద్దలు కావడం లాంఛనమే కావచ్చు.