కమల్ హాసన్ సినిమా కెరీర్ దాదాపు ముగిసినట్లే అని కొన్నేళ్ల కిందట అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. వయసు మీద పడింది. సినిమాలు సరిగా ఆడట్లేదు. పైగా రాజకీయాల వైపు అడుగులు వేశాడు. దీంతో ఆయన కథ కంచికే అని అంతా అనుకున్నారు. కానీ మంచికో చెడుకో రాజకీయాల్లో కమల్ ఫెయిలయ్యాడు. తిరిగి సినిమాలవైపు అడుగులు వేశాడు.
లోకేష్ కనకరాజ్ లాంటి యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్‌తో విక్రమ్ లాంటి అదిరిపోయే థ్రిల్లర్ సినిమా చేసి బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చాడు. దీంతో కమల్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఈ ఊపులో క్రేజీ కాంబినేషన్లలో వరుసగా సినిమాలు లైన్లో పెడుతూ దూసుకెళ్తున్నాడు కమల్.
ఇదే సమయంలో కమల్ కొత్తగా ఒక వ్యాపారంలోకి కూడా అడుగు పెడుతున్నాడన్న వార్త కొన్ని నెలల కిందటే బయటికి వచ్చింది. కమల్ హాసన్ హౌస్ ఆఫ్ ఖద్దర్ పేరుతో బట్టల దుకాణాల చైన్ మొదలుపెట్టడానికి కమల్ నిర్ణయించుకున్నాడు. ఖద్దర్ అని పేరుంది కదా అని ఆయనేమీ పాత కాలం ఖద్దరు దుకాణాలేమీ తెరవట్లేదు. ట్రెండీగా ఉండే ఖద్దరు దుస్తులతోనే ఈ వ్యాపారం మొదలవుతోంది. ఈ బిజినెస్‌కు బ్రాండ్ అంబాసిడర్ కూడా కమలే.
ఇందుకోసం తాజాగా ఆయన ఒక ట్రెండీ ఫొటో షూట్ చేశారు. యంగ్ అమ్మాయిలు, అబ్బాయిలతో కలిసి హుషారుగా ఆయన చేసిన ఈ ఫొటో షూట్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఈ వయసులో అంత హుషారుగా.. చలాకీగా కనిపించడం కమల్‌కే చెల్లింది. ఈ ఫొటో షూట్ చూస్తే ఎవ్వరికైనా ఒక పాజిటివ్ ఫీల్ వస్తుందనడంలో సందేహం లేదు. అందుకే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates