ఫాంటసీ జానర్ లో టైం ట్రావెల్ చాలా ప్రత్యేకమైన కాన్సెప్ట్. ఎప్పుడో 1991లో బాలకృష్ణతో సింగీతం శ్రీనివాసరావు గారు ఆదిత్య 369 రూపంలో దీన్ని తెలుగు ప్రేక్షకులు పరిచయం చేసినప్పుడు అందరూ సంభ్రమాశ్చర్యాలతో గొప్ప విజయం కట్టబెట్టారు. అఫ్కోర్స్ ఇది హాలీవుడ్ మూవీ బ్యాక్ టు ది ఫ్యూచర్ నుంచి స్ఫూర్తి చెందిందే అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ టేస్ట్ కి తగట్టు మలచిన తీరు బ్లాక్ బస్టర్ అందించింది. ఆ తర్వాత మళ్ళీ అలాంటి రిస్కులు ఎవరు తీసుకోలేదు. దానికన్నా అంతకు మించి గొప్ప కథను రాయడం ఎవరి వల్ల కాలేదనేది కరెక్ట్.
ఇటీవలి కాలంలో మళ్ళీ టైం ట్రావెల్, టైం లూప్ థీమ్ తో వస్తున్న సినిమాలు ఎక్కువవుతున్నాయి. విక్రమ్ కుమార్ తీసిన సూర్య 24 ఎంత స్పెషల్ మూవీనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత ప్లే బ్యాక్ అనే చిన్న చిత్రం ఇదే థీమ్ తో వస్తే జనం పెద్దగా పట్టించుకోలేదు. తేజ సజ్జ అద్భుతం కూడా టైటిల్ కు తగ్గట్టు మేజిక్ ఏమీ చేయలేదు. తమిళంలో శింబు మానాడుతో పెద్ద హిట్టే కొట్టాడు. దీన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు అల్రడీ సురేష్ బాబు హక్కులు కొనేశారు. ఇవన్నీ టైం లూప్ మీద నడిచేవే. ఒకరకంగా చెప్పాలంటే క్రమంగా ఇది రొటీన్ ఫార్ములాగా మారిపోతోంది. ఇవి చాల్లేదని తాజాగా మరో టైం లూప్ సినిమా వచ్చింది.
దాని పేరు బనారస్. జయేద్ ఖాన్ అనే కన్నడ కుర్రాడు హీరో. తండ్రిది పెద్ద బ్యాక్ గ్రౌండ్ కావడంతో భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఓ కుర్రాడు చేసిన పొరపాటు వల్ల ఇష్టపడిన అమ్మాయి బనారస్ వెళ్ళిపోతుంది. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి అక్కడికి వెళ్లిన ఆ యువకుడికి టైం లూప్ వల్ల పదే పదే జరిగిన సంఘటనలే మళ్ళీ ఎదురవుతాయి. ఇలా ఎందుకు జరిగిందనేది స్టోరీ. వెంకట్ ప్రభు సీనియర్ కాబట్టి మానాడుని కన్ఫ్యూజన్ లేకుండా నీట్ గా డీల్ చేశారు కానీ బనారస్ దర్శకుడు జయతీర్థ కొన్ని ట్విస్టులు మినహాయించి మిగిలినందంతా రిపీట్ మోడ్ లో నడిపించడంతో బోరింగ్ గా సాగింది. ఇకనైనా ఈ టైం లూపుల మూవీస్ కి బ్రేక్ ఇస్తే బెటరేమో.