‘కాంతార’ అనేది కన్నడ సినిమా. అది కర్ణాటకలోని ఒక ప్రాంతానికి సంబంధించిన ఆచార సంప్రదాయాల చుట్టూ తిరిగే సినిమా. నేటివిటీ ఫ్యాక్టర్ అందులో కీలకం. ఇక ఈ చిత్ర హీరో కమ్ ప్రొడ్యూసర్ రిషబ్ శెట్టి గురించి మన వాళ్లకు ఏమీ తెలియదు. ఇక ఈ చిత్రానికి తెలుగులో పెద్దగా ప్రమోషన్ కూడా ఏమీ చేయలేదు.
కేవలం మౌత్ టాక్, రివ్యూలు పాజిటివ్‌గా ఉండడం.. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చాలా చర్చ జరగడంతో మన ప్రేక్ష్ఖకుల్లో ఆసక్తి కలిగింది. సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఆల్రెడీ ఈ చిత్రానికి తెలుగులో మాత్రమే రూ.50 కోట్ల వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ ‘కాంతార’ రూ.300 కోట్ల గ్రాస్ మార్కును కూడా దాటేసింది. ఐతే ఈ సినిమా థియేట్రికల్ రన్ మీద నిర్మాతలేమీ ఆశలు వదులకున్నట్లుగా లేరు.
కన్నడలో ఐదో వారంలో, తెలుగు, హిందీ భాషల్లో మూడో వారంలోనూ సినిమా మంచి వసూళ్లు రాబడుతుండడంతో.. ఇప్పుడు ప్రమోషన్ జోరు పెంచుతున్నారు. హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి వివిద రాష్ట్రాల్లో సక్సెస్ టూర్లు చేస్తూ సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో అతడికి అదిరిపోయే ప్రమోషనల్ సపోర్ట్ దొరికింది. దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్, భారతీయులకు కూడా ఎంతో ఇష్టమైన ఏబీ డివిలియర్స్.. ‘కాంతార’ సినిమాను ప్రమోట్ చేయడం విశేషం.
మిస్టర్ 360గా పేరున్న ఏబీకి బెంగళూరు కేంద్రంగా ఆడే రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో, కన్నడిగులతో ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. గత సీజన్‌కు ముందే ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ.. తర్వాతి సీజన్‌కు ఆర్సీబీ సపోర్ట్ స్టాప్‌లో భాగం కాబోతున్నాడు. ఇందుకోసం బెంగళూరుకు వచ్చిన ఏబీ.. రిషబ్‌తో కలిసి ‘కాంతార’ సినిమాకు ఎలివేషన్ ఇచ్చాడు. కాంతార సినిమాను తప్పక చూడండని చెప్పడంతో పాటు ఆ సినిమాలో బాగా పాపులర్ అయిన సౌండ్‌ను రిషబ్‌తో కలిసి రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు. ఇలా ఒక లెజెండరీ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఒక ప్రాంతీయ సినిమాను ప్రమోట్ చేయడం గొప్ప విషయం. ‘కాంతార’ రీచ్ దీని వల్ల మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.