పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సినీ రంగంలో ఉన్న అత్యంత సన్నిహితులైన స్నేహితుల్లో ఆలీ ఒకడు. కెరీర్ ఆరంభంలో పవన్ చేసిన ‘తొలి ప్రేమ’ దగ్గర్నుంచి వీరి స్నేహ బంధం కొనసాగుతోంది. పవన్ నటించిన చాలా చిత్రాల్లో ఆలీ అతడి స్నేహితుడిగా నటించాడు. ఆ స్నేహ బంధం వ్యక్తిగత జీవితంలోనూ కొనసాగింది. పవన్ స్వయంగా ఆలీ తనకెంత క్లోజ్ ఫ్రెండో కొన్ని సందర్భాల్లో వెల్లడించాడు. తన తల్లి వద్దన్నా కూడా ఆలీతో స్నేహాన్ని వదులుకోలేకపోతున్నానని సరదాగా వ్యాఖ్యానించాడు. కానీ అలాంటి స్నేహితుల మధ్య రాజకీయం చిచ్చు పెట్టింది.
పవన్ పెట్టిన జనసేనలో కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీకి ప్రచారం చేయడం పవన్‌కు నచ్చలేదు. దీనిపై బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. దీనికి ఆలీ కూడా కొంచెం ఘాటుగానే బదులిచ్చాడు. కానీ ఆ టైంలో నెలకొన్న దూరం తర్వాత తగ్గినట్లే కనిపిస్తోంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పవన్ గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడాడు ఆలీ. పవన్ చివరి రెండు సినిమాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్‌ల్లో తాను నటించకపోవడంపై అతను క్లారిటీ ఇచ్చాడు. అవి రెండూ సీరియస్ సినిమాలని, వాటిలో కామెడీకి స్కోప్ లేదని.. అందులో వేరే ఏ కమెడియన్ కూడా లేని విషయాన్ని గుర్తించాలని పవన్ అన్నాడు. పవన్ తర్వాత చేయబోయే సినిమాల్లో కచ్చితంగా తాను ఉంటానని.. తమ మధ్య ఏ గ్యాప్ లేదని ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు ఆలీ.
ఇక తాను ఈటీవీలో చేసే ‘ఆలీతో సరదాగా’ షోలోనూ పవన్ పాల్గొనే అవకాశాలున్నట్లు ఆలీ వెల్లడించాడు. ఇప్పటిదాకా తన మిత్రుడిని ఈ షోకు తీసుకురాలేకపోయానని.. త్వరలో కచ్చితంగా ఆయనతో ఎపిసోడ్ ఉంటుందని ఆలీ హామీ ఇచ్చాడు. మరోవైపు బాలయ్య చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో పవన్ పాల్గొంటాడని వస్తున్న వార్తలపై ఆలీని ప్రశ్నించగా.. దాని గురించి తనకు సమాచారం లేదని చెప్పాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates