‘దేవుడు’ ట్రెండ్ మీద కన్నేస్తున్న టాలీవుడ్

ఏదన్నా ఒక్క కాన్సెప్ట్ హిట్టయ్యిందంటే.. దానినే మూసగా ఫాలో అయిపోవడం టాలీవుడ్ కు బాగా అలవాటు. పేరు చివరన ‘రా’ తగిలించడం, ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లో సినిమాలు చేయడం.. హీరోయిన్ గా బాలీవుడ్ అమ్మాయిన దింపడం.. ఇలా ఒక సినిమాలో ఒకటి హిట్టయ్యిందంటే దానిని ట్రెండ్ గా మార్చేస్తుంటారు. స్టోరీల విషయంలో కూడా అంతే. రంగస్థలం హిట్టయ్యింది కాబట్టి సగం సినమాలన్నీ అలాంటి రస్టిక్ లుక్ లోనే ఉండేలా చూసుకుంది టాలీవుడ్. కాని అవన్నీ ఆడలేదు. ఇప్పుడు కూడా అంతే.. దేవుడు ట్రెండ్ మీద కన్నేశారట.

అఖండ.. కార్తికేయ 2.. కాంతారా.. ఈ సినిమాలన్నింటిలోనూ ఒక్కటే కామన్. బ్లాక్ బస్టర్ సక్సెస్ మాత్రమేకాదు, ఈ కథలన్నీ దేవుళ్ళ చుట్టూనే తిరుగుతుంటాయ్. శివుడు, కృష్ణుడు, విష్ణుమూర్తి.. ఇలా ఈ సినిమాల్లో హీరోలు దేవుళ్ళ తాలూకు గొప్పతనం తెలుసుకోవడం, దేవుడి శక్తిని ఆవాహనం చేసుకుని విలన్స్ ను ఎటాక్ చేయడం.. ఒకటే కాన్సెప్ట్. ఇప్పుడు చాలామంది హీరోలు వాళ్ల డైరక్టర్లూ ఇదే కాన్సెప్ట్ ను పట్టుకుంటున్నారట.

ముఖ్యంగా ఎన్టీఆర్ 30వ సినిమా కోసం ఇప్పటి వరకు ఫ్యాంటసీ ఎలిమెంట్ టచ్ చేయని కొరటాల శివ కూడా.. అలాంటి ఒక డివైన్ ఎలిమెంట్ తీసుకున్నాడట. ఆల్రెడీ ఆచార్య సినిమాలో ఇలానే ఘట్టమ్మతల్లి అంటూ ఒక అమ్మవారి ఎలిమెంట్ తీసుకుని ఫెయిల్ అయిన కొరటాల.. మళ్లీ అలాంటి ఎలిమెంటే తీసుకోవడం కాస్త ఆశ్చర్యకరంగానే ఉందిలే.

సెహరి ఫేం డైరక్టర్ ఇప్పుడు సుధీర్ బాబుతో తీస్తున్న కొత్త సినిమాలో యాక్షన్‌ ఎలిమెంట్స్ అన్నీ డివైన్ ఎలిమెంట్స్ తోనే లింక్ చేసుంటాయ్ అని తెలుస్తోంది. అంతేకాదు, రామ్ పోతినేని, బోయపాటి సినిమాలో అఖండ తరహాలో ఒక శివతత్వం బోధిస్తాడని అంటున్నారు. ఏదేమైనా కూడా మానవుడికి దేవుడి బలం యాడ్ చేయడం అనేది ఇప్పుడు ట్రెండింగ్ కాన్సెప్టుగా మారింది. జనాలకు బోర్ కొట్టేవరకు మనోళ్ళు ఈ ట్రెండ్ ను వదిలేలా కూడా కనిపించట్లేదు.