కన్నడ సినిమా అయినప్పటికీ.. దేశవ్యాప్తంగా సత్తా చాటుతోంది ‘కాంతార’. ‘కేజీఎఫ్’ లాంటి మాస్ మసాలా మూవీ దేశవ్యాప్తంగా ఘనవిజయం సాధించడంపై మరీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ పూర్తిగా కన్నడ నేటివిటీతో సాగే ‘కాంతార’ లాంటి వైవిధ్యమైన సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధిస్తున్న వసూళ్లు.. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తున్న తీరు కచ్చితంగా షాకింగే. ఈ సినిమాలో అందరూ మెచ్చింది, వారెవా అంటూ ఆశ్చర్యపోతున్నది క్లైమాక్స్ గురించే.
సినిమాలో మిగతాదంతా ఒకెత్తయితే.. పతాక సన్నివేశాలు మరో ఎత్తు అని చెప్పాలి. నిజానికి సినిమాకు ఇంత అప్లాజ్ రావడానికి, సినిమా ఈ స్థాయి విజయం సాధించడానికి క్లైమాక్సే ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. మధ్యలో కొంచెం స్లో అయి.. బోరింగ్‌గా అనిపించే సినిమా.. చివరికొచ్చేసరికి మాంచి హై ఇచ్చి ప్రేక్షకులను ఒక ప్రత్యేకమైన అనుభూతితో థియేటర్ల నుంచి బయటికి పంపిస్తుంది.
ఈ క్లైమాక్స్ విషయంలో నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి చూపించిన ప్రతిభకు అందరూ అతణ్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఐతే నటుడిగా అవార్డ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చిన రిషబ్.. దర్శకుడిగా క్లైమాక్స్‌కు పూర్తి క్రెడిట్ తీసుకోలేడు. ఎందుకంటే స్క్రిప్టు వరకు అతడి ఘనతే అయినా.. ఆ సన్నివేశాలను చిత్రీకరించింది మాత్రం అతడి మిత్రుడైన మరో టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్ బి.శెట్టి.
ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన ‘గరుడ గమన వృషభ వాహన’ చాలా పెద్ద హిట్టయింది. కన్నడలో దాన్నొక కల్ట్ మూవీగా చూస్తున్నారంతా. ఆ చిత్రంలో రిషబ్, రాజ్ ముఖ్య పాత్రలు పోషించగా.. రాజ్‌యే దర్శకత్వం వహించాడు. సరికొత్త సినిమాలతో కన్నడ ఇండస్ట్రీని మలుపు తిప్పిన క్రెడిట్ రిషబ్, రాజ్‌లతో పాటు రక్షిత్ శెట్టిలకే ఇస్తున్నారంతా. రిషబ్‌తో ఉన్న స్నేహం వల్ల ‘కాంతార’ మేకింగ్‌ను దగ్గరుండి చూసుకున్నాడు రాజ్. పతాక సన్నివేశాల్లో రిషబ్ పూర్తిగా తన పెర్ఫామెన్స్ మీద దృష్టిపెట్టేలా.. ఆ సన్నివేశాలను రాజ్ డైరెక్ట్ చేశాడు. అందుకే ‘గరుడ గమన..’లో ఉన్న డివైన్ టచ్ ఈ సన్నివేశాల్లోనూ కనిపిస్తుంది.