చాలా కాలంగా నిర్మాతలను వేధిస్తున్న సమస్య బుక్ మై షో రేటింగ్స్, రివ్యూస్. టికెట్లు కొన్నా కొనకపోయినా ఇవి ఇచ్చే వెసులుబాటు ఉండటంతో కొన్ని వందల మంది ముఠాగా ఏర్పడి దీన్నో వ్యాపారంగా మార్చుకున్న వైనం గురించి చాలాసార్లు ప్రొడ్యూసర్లు గళం విప్పుతూనే ఉన్నారు. ఇటీవలే ఈషా విషయంలో జరిగితే సదరు మేకర్స్ తీవ్ర స్వరంతో ఆవేదన, ఆవేశాన్ని వ్యక్తం చేశారు.
అంతకు ముందు నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో ఈ దందా గురించి తప్పని పరిస్థితుల్లో ఒక్కోసారి వీటికి డబ్బులు ఖర్చు పెట్టడం గురించి చెప్పడం చూశాం. ఇకపై ఇలాంటి కష్టాలు తగ్గనున్నాయి. దానికి మన శంకరవరప్రసాద్ గారు శ్రీకారం చుట్టింది.
ఎల్లుండి విడుదల కాబోతున్న మెగా మూవీకి బుక్ మై షోలు రేటింగ్, రివ్యూస్ ఇవ్వడం కుదరదు. వాటిని డిజేబుల్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని యాప్ నిర్వాహకులు అక్కడో నోట్ పెట్టారు. బాట్స్ టెక్నాలజీ వాడి అడ్డగోలుగా సినిమాను నెగటివ్ చేయడం, పాజిటివ్ చేయడం రెండు పనులు వరప్రసాద్ విషయంలో కుదరవు.
దీనికి సంబంధించిన ప్లానింగ్, ప్రణాళిక కొన్ని వారాల నుంచి జరుగుతున్నప్పటికే ఇప్పటికి అమలయ్యింది. దీనికి చొరవ తీసుకుని ఫలితం తెచ్చిన ఏఐ ప్లెక్స్, బ్లాకింగ్ బిగ్ కు నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ పెట్టింది.
నిజానికి బుక్ మై షోను అడ్డుపెట్టుకునే చాలా మంది యాంటీ ఫ్యాన్స్ సినిమాలను డ్యామేజ్ చేయడం పలుమార్లు జరిగింది. అంతే కాదు అంతంతమాత్రంగా ఉన్న సినిమాలకు రేటింగ్స్ ఎక్కువగా చూపించి ఓటిటి, శాటిలైట్ దగ్గర ఎక్కువ సొమ్ములు చేసుకున్న నిర్మాతలూ లేకపోలేదు. రెండువైపులా చూసుకుంటే ఇది మంచి పరిణామమే.
కేవలం టికెట్లు అమ్మడానికి మాత్రమే పరిమితం కావాల్సిన ఒక బుకింగ్ ప్లాట్ ఫార్మ్ ఇలాంటి బాట్స్ కు అవకాశం ఇవ్వడమే కరెక్ట్ కాదు. అలాంటిది సంవత్సరాల తరబడి నానుస్తూ ఫైనల్ గా న్యాయ స్థానం చెప్పే దాకా దానికి అడ్డుకట్ట ఎందుకు వేయలేదనేది వేయి డాలర్ల ప్రశ్న. మిగిలిన సినిమాలకు అయితే రేటింగ్స్, రివ్యూలు ఎప్పటిలాగే యాక్టివ్ గా ఉన్నాయి. మిగిలిన వాళ్ళు కూడా ఈ రూట్ ఫాలో అవుతారేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates