తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి వచ్చే అవకాశాలు నిర్మాతకు దొరుకుతాయి. కానీ ధృవ నచ్చతిరం పరిస్థితి విచిత్రమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ ప్యాన్ ఇండియా మూవీ నిర్మాణం 2017లో మొదలయ్యింది. పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ కాగా హారిస్ జైరాజ్ సంగీతం సమకూర్చారు. కోవిడ్ టైంలో పడిన బ్రేకులు, దానికి ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించిన గౌతమ్ మీనన్ ఆర్థిక ఇబ్బందులు ప్రాజెక్టుని ఆలస్యం చేస్తూ వచ్చాయి. 2023లో గుమ్మడికాయ కొట్టారు.

పలుమార్లు రిలీజ్ డేట్లు ప్రకటిస్తూ వచ్చిన గౌతమ్ మీనన్ దేనికీ కట్టుబడకుండా చాలా డ్యామేజ్ చేసుకున్నారు. ఈ చిత్రం కోసమే నటుడిగా మారి రెమ్యునరేషన్లు తీసుకుంటున్నానని, యాక్టర్ గా తన కొత్త ప్రయాణం ఈ రకంగా ఉపయోగపడుతోందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే తాజా రిపోర్ట్ ప్రకారం ధృవ నచ్చతిరం త్వరలోనే విడుదల కానుంది. ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో రిలీజ్ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయట. జన నాయకుడు ఆ నెలలో వచ్చే అవకాశాలు పరిశీలించి, ఎలాంటి పోటీ లేని టైంలో ధృవ నచ్చతిరంని థియేటర్లకు తీసుకురావాలని గౌతమ్ మీనన్ ప్లాన్ చేస్తున్నారు.

త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇన్ సైడ్ టాక్ అయితే ధృవ నచ్చతిరం రెండు భాగాలు చేశారు. ఏ మాత్రం పాజిటివ్ వైబ్స్ లేని ఈ సినిమాకు ప్రమోషన్ పెద్ద ఛాలెంజ్ కానుంది. అయితే దశాబ్దం పైగా రిలీజ్ ఆగిపోయిన విశాల్ మదగజరాజ ఎలాగైతే గత ఏడాది విడుదలై సూపర్ హిట్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచిందో, అదే తరహాలో ధృవ నచ్చతిరం కూడా మేజిక్ చేస్తుందనే నమ్మకంతో గౌతమ్ మీనన్ ఉన్నారు.

ఐశ్యర్య రాజేష్, పార్తీబన్, జైలర్ విలన్ వినాయకన్, సిమ్రాన్, రాధికా శరత్ కుమార్, అర్జున్ దాస్ తదితరులతో పెద్ద క్యాస్టింగే ఉంది. ఆరుగురు సినిమాటోగ్రాఫర్లు ఈ సినిమాకు పని చేశారు.