కాంతార.. కన్నడలో కన్నా ఎక్కువ

‘కాంతార’ సినిమా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ఎవరో మనకు తెలియదు. అతడి పక్కన హీరోయిన్‌గా నటించిన అమ్మాయి కూడా కొత్తే. ఇక సినిమాలో చేసిన మిగతా నటీనటులతోనూ మనవాళ్లకు పెద్దగా పరిచయం లేదు. ఇక ఈ సినిమా కథాంశం చూస్తే పూర్తిగా కన్నడ నేటివిటీతో నడిచేది. దాని గురించి కూడా మన వాళ్లకు అవగాహన లేదు. ఐతేనేం ఈ సినిమాకు మన ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

కన్నడ వెర్షన్ చూడడానికి మన వాళ్లు చూపించిన ఆసక్తి చూసి చకచకా ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించి ఈ శనివారం విడుదల చేయగా.. మన స్టార్ హీరోలు నటించిన సినిమాల తరహాలో ఇది బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపుతోంది. శని, ఆదివారాల్లో పెద్ద పెద్ద సింగిల్ స్క్రీన్లలో కూడా ‘కాంతార’ హౌస్ ఫుల్ వసూళ్లతో రన్ అయింది. డిమాండ్, క్రేజ్ చూసి ఆదివారం స్క్రీన్లు, షోలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

‘కాంతార’ తెలుగు వసూళ్లు చూసి కన్నడ ట్రేడ్ పండిట్లు కూడా షాకైపోతున్నారు. కర్ణాటకలో గత నెల 30న రిలీజైన ‘కాంతార’ తొలి రోజు రూ.2.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. కన్నడ సినిమా స్థాయికి అక్కడవి మంచి వసూళ్లే. ఐతే ఈ చిత్రం తెలుగులో తొలి రోజు రూ.4.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. ఒక కన్నడ సినిమా కర్ణాటకలో కంటే.. డబ్బింగ్ వెర్షన్ ద్వారా తెలుగులో ఎక్కువ వసూళ్లు రాబట్టడం అన్నది అనూహ్యమైన విషయం.

‘కేజీఎఫ్-2’ కూడా ఇలాగే తెలుగులో సంచలనం రేపింది కానీ.. ఆ సినిమాకు ఉన్న క్రేజ్ వేరు. ‘కాంతార’ ఇలాంటి ఘనత సాధించడం మాత్రం అనూహ్యమైన విషయమే. రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు రూ.10 కోట్ల మార్కును టచ్ చేయడం విశేషం. ఫుల్ రన్లో ‘కాంతార’ రూ.20 కోట్ల మార్కును కూడా అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వరల్డ్ వైడ్ ఈ సినిమా వసూళ్లు రూ.100 కోట్ల మార్కును టచ్ చేశాయి.