భీమ్లా నాయ‌క్.. బాల‌య్య సినిమా?

రెండేళ్ల కింద‌ట మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన అయ్య‌ప్ప‌నుం కోషీయుం సినిమా రీమేక్ హ‌క్కుల‌ను ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా తీసేసుకుంది సితార ఎంట‌ర్టైన్మెంట్స్ సంస్థ‌. ఇక అప్ప‌ట్నుంచి ఈ సినిమా లీడ్ రోల్స్ కోసం న‌టీన‌టులతో పాటు ఎంపిక ప్ర‌క్రియ మొద‌లైంది. కానీ ఈ విష‌యం ఎంత‌కీ తేల‌లేదు.

ఒరిజిన‌ల్లో పృథ్వీరాజ్ చేసిన పాత్ర‌కు రానా ద‌గ్గుబాటి త్వ‌ర‌గానే ఖాయం అయ్యాడు కానీ.. మ‌రో పాత్ర‌కు ఎవ‌ర‌నే విష‌యంలో సుదీర్ఘ కాలం సందిగ్ధ‌త న‌డిచింది. నంద‌మూరి బాల‌కృష్ణ‌, ర‌వితేజ‌.. ఇలా చాలా పేర్లే వినిపించాయి. చివ‌రికి ఆ స్థానంలోకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చాడు. ఆయ‌న ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లు క‌థాక‌థ‌నాలు కూడా మారాయి. టైటిల్ కూడా ప‌వ‌న్ పాత్ర‌ను సూచించేలా భీమ్లా నాయ‌క్ అని పెట్టారు. ఈ సినిమా ప‌వ‌న్ కెరీర్లో ప్ర‌త్యేకంగా నిలిచింది. క‌మ‌ర్షియ‌ల్‌గానూ సినిమా బాగానే ఆడింది.

ఐతే ప‌వ‌న్ కాకుండా బాల‌య్య ఈ పాత్ర చేసి ఉంటే సినిమా ఎలా ఉండేద‌న్న ఊహ ఆస‌క్తి రేకెత్తించేదే. ఇప్పుడు ఆ చ‌ర్చే న‌డుస్తోంది. బాల‌య్య హోస్ట్ చేసే అన్ స్టాప‌బుల్ షోకు అతిథిగా వ‌చ్చిన భీమ్లా నాయ‌క్ నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీని బాల‌య్య ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న అడిగాడు. భీమ్లా నాయ‌క్ సినిమాకు ముందు ఎవ‌రిని అడిగారు అని. ఈ ఎపిసోడ్ ప్రోమోలో నాగ‌వంశీ స్పంద‌న చూస్తే.. బాల‌య్య‌ను ఆ పాత్ర కోసం అడిగార‌ని స్ప‌ష్టంగా తెలిసిపోయింది.

మ‌రి పూర్తి వివ‌రాలు ఎపిసోడ్ వ‌చ్చిన‌పుడే చూడాలి. మ‌రి బాల‌య్య ఎందుకు ఈ పాత్ర చేయ‌లేద‌న్న‌ది ఆస‌క్తిక‌రం. మామూలుగా బాల‌య్య‌కు రీమేక్‌ల ప‌ట్ల పెద్ద ఆస‌క్తి ఉండ‌దు. మ‌రి ఆ కార‌ణంతో నో అన్నాడా లేక తన ఇమేజ్‌కు ఆ పాత్ర సెట్ట‌వ్వ‌ద‌ని అనుకున్నాడా.. లేక ఖాళీ లేక ఈ సినిమా చేయ‌లేదా? చూద్దాం ఏం స‌మాధానం వ‌స్తుందో?