‘ఈగ’ ఇప్పుడు కానీ రిలీజయ్యుంటే..

ఇంత కాలం రాజమౌళి జాతీయ స్థాయి దర్శకుడిగా ఎదిగినందుకు గర్విస్తుండేవాళ్లం. కానీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆయన పేరు మార్మోగిపోతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఆయనకు అమెరికా సహా వివిధ దేశాల్లో వస్తున్న అప్లాజ్ అలాంటిలాంటిది కాదు. ఈ సినిమా చూసి పిచ్చెక్కిపోయిన నేటివ్ అమెరికన్స్.. జక్కన్న పాత సినిమాలను వరుసబెట్టి స్పెషల్ షోలు వేసి చూడడం.. వాటికి అద్భుతమైన స్పందన వస్తుండడం విశేషం. ‘బాహుబలి’ని అప్పుడు పట్టించుకోని వాళ్లు ఇప్పుడు దాన్ని కూడా కొనియాడుతున్నారు.

అదే కాదు.. రాజమౌళి దశాబ్దం కిందట తీసిన ‘ఈగ’ సినిమా కూడా గొప్ప ప్రశంసలు అందుకుంటోంది. ఆ సినిమాకు అమెరికన్స్ నుంచి వచ్చిన స్పందన అనూహ్యం. నిజానికి ‘ఈగ’ కొన్ని హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో తీసిన చిత్రమే. కానీ ఏదైనా సన్నివేశం, లేదా కథాంశం నుంచి రాజమౌళి స్ఫూర్తి పొందినా ఒరిజినల్‌ను మించి మెరుగులుదిద్దడం ఆయన స్పెషాలిటీ. ‘ఈగ’ కూడా ఇప్పుడు అలాంటి ప్రశంసలే అందుకుంటోంది.

నిజానికి ‘ఈగ’ సినిమా అప్పట్లో ఆడాల్సినంత ఆడలేదన్నది వాస్తవం. నాని లాంటి చిన్న హీరో ఇందులో కథానాయక పాత్ర పోషించాడు. కానీ అతను కనిపించేది అరగంటే. మిగతా సినిమా అంతా ఈగదే ఆధిపత్యం. అంత చిన్న జీవిని పెట్టి జక్కన్న ప్రేక్షకులను ఎంతగా ఉర్రూతలూగించాడో తెలిసిందే. అప్పటికి తాను తీసిన విజువల్ వండర్‌ను రాజమౌళి కూడా సరిగా ప్రమోట్ చేసుకోలేదు. కొత్త నిర్మాత, తన మిత్రుడు అయిన సాయి కొర్రపాటి తనను నమ్మి పెట్టిన పెద్ద బడ్జెట్ కొంచెం లాభాలు వచ్చేసరికి దానికే సంతృప్తి పడిపోయాడు.

ఇదొక యూనివర్శల్ మూవీ. ఇండియా మొత్తం ఇరగాడేసే స్కోప్ ఉన్నది. ఆ చిత్రాన్ని తమిళంలో, హిందీలో రిలీజ్ చేశారు కానీ.. సరిగా ప్రమోట్ చేయలేదు. పెద్ద రిలీజ్ కూడా దక్కలేదు. అలా కాకుండా ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి ఈ సినిమా వచ్చి ఉంటే.. దాని రీచ్ మామూలుగా ఉండేది. అలవోకగా వందల కోట్లు కొల్లగొట్టేసేదే. బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లకు దీటుగా నిలిచేదే.