సంక్రాంతికి చిరు.. ఇదిగో క్లారిటీ

దసరా పండక్కి ‘గాడ్ ఫాదర్’తో సందడి చేశాడు చిరు. దీని తర్వాత తెలుగు వారికి అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతికి కూడా ఆయన సందడి ఉంటుందని ఇంతకుముందే ప్రకటన వచ్చింది. బాబీ దర్శకత్వంలో చిరు నటిస్తున్న కొత్త చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు చాలా ముందుగానే ప్రకటించారు.

ఐతే విడుదలకు ఇంకో మూడు నెలలే సమయం ఉండగా ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్స్ ఏమీ తెలియట్లేదు. ఇప్పటిదాకా కనీసం టైటిల్ కూడా ప్రకటించకపోవడంతో సంక్రాంతికి ఈ చిత్రం రావడమే సందేహమే అంటున్నారు. రెండు మూడు రోజులుగా ఈ రకమైన ప్రచారం ఊపందుకుంటోంది. చిరు-బాబీ సినిమా వేసవికి వాయిదా అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఐతే వీటికి చిత్ర బృందం చెక్ పెట్టింది. సంక్రాంతికి తమ చిత్రం పక్కాగా వస్తుందనే విషయాన్ని శుక్రవారం చెప్పకనే చెప్పింది మెగా 154 టీం.

‘వాల్తేరు వీరయ్య’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిరు కొత్త చిత్రం అప్పుడే డబ్బింగ్ వర్క్‌లోకి దిగిపోయింది. శుక్రవారం పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పని షురూ చేశాడు దర్శకుడు బాబీ. చిత్రీకరణ చివరి దశలో ఉంటే తప్ప డబ్బింగ్ పనులు మొదలు కావు. ఎప్పుడో వేసవిలో సినిమా రిలీజ్ చేసేట్లయితే ఇప్పుడే డబ్బింగ్ చెప్పించాల్సిన అవసరం లేదు. షూటింగ్ చివరి దశగా ఉండగా.. ముందు నుంచే డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెడితే తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో హడావుడి ఉండదని.. అన్నీ టైం ప్రకారం జరిగిపోతాయని భావించి ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇటీవలే ఈ సినిమా సెట్స్ నుంచి లీక్ అయిన చిరు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందులో చిరు ఊర మాస్‌గా కనిపిస్తున్నాడు. మాస్ రాజా రవితేజ ఇందులో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. చిరు సరసన ఇందులో శ్రుతి హాసన్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.