చిరు కొత్త లుక్.. వారెవా


మెగాస్టార్ చిరంజీవిని ఊర మాస్ క్యారెక్ట‌ర్లలో చూడ‌డానికి అభిమానులు ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తారు. గ్యాంగ్ లీడ‌ర్‌, రౌడీ అల్లుడు, శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ లాంటి చిత్రాల్లో ఆయ‌న ర‌ఫ్ లుక్ అభిమానులను ఎంత‌గా ఆక‌ట్టుకుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇప్ప‌టికీ ఆ సినిమాల‌ను, అందులో చిరు లుక్స్‌ను గుర్తు చేసుకుంటూ వింటేజ్ చిరును మ‌ళ్లీ చూడాల‌ని కోరుకుంటూ ఉంటారు.

బాబీ ద‌ర్శ‌క‌త్వంలో చిరు న‌టిస్తున్న వాల్తేర్ వీర‌య్య అభిమానుల ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్లే ఉంటుంద‌న్న సంకేతాలు ముందు నుంచి వినిపిస్తున్నాయి. చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ.. స‌గ‌టు అభిమానులు చిరును ఎలా చూడాల‌ని కోరుకుంటారో అలాగే ఈ సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లుగా చిత్ర బృందం చెబుతూ వ‌స్తోంది.

తాజాగా గాడ్ ఫాద‌ర్ స‌క్సెస్ మీట్లో చిరు మాట్లాడుతూ.. బాబీ సినిమా అల్ల‌ర‌ల్ల‌రిగా, కామెడీగా సాగుతుంద‌ని.. రౌడీ అల్లుడు స్ట‌యిల్లో ఉంటుంద‌ని చెప్పి అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచాడు. ఆయ‌న ఈ సంకేతాలు ఇచ్చిన కొన్ని రోజుల‌కే ఈ సినిమాలో చిరు మాస్ లుక్ బ‌య‌టికి వ‌చ్చింది. ఆన్ లొకేష‌న్ ఫొటోలు కొన్ని లీక్ అయ్యాయి. అందులో చిరు ఊర మాస్‌గా క‌నిపిస్తున్నాడు. డ్రెస్సింగ్ స్టైల్, హేర్ స్టైల్, ఓవ‌రాల్ లుక్ అన్నీ కూడా మ‌మ మాస్ అనిపిస్తున్నాయి. వింటేజ్ చిరును గుర్తుకు తెస్తున్నాయి.

ఈ ఫొటోలు ఎలా లీక్ అయ్యాయో కానీ.. వెంట‌నే చిత్ర బృందం అలెర్ట‌యింది. సోష‌ల్ మీడియా నుంచి వాటిని తీయించే ప‌నిలో ప‌డింది. అభిమానులు వాటిని షేర్ చేయొద్ద‌ని పిలుపునిచ్చింది. కానీ ఆలోపే ఆ ఫొటోలు వైర‌ల్ అయిపోయాయి. అవి చూసి సినిమా మీద మ‌రింత అంచ‌నాలు పెంచుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రం వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.