ఇదేం సినిమా మాధురీజీ

కొందరు హీరోయిన్లకు ఎంత వయసొచ్చినా మొహంలో కళ, ఒంట్లో గ్లామర్ ఎంత మాత్రం తగ్గినట్టు అనిపించవు. పేరుకు తల్లి వదిన పాత్రలు చేస్తున్నారన్న మాటే కానీ ఇప్పుడున్న వాళ్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో వీళ్ళ ఆకర్షణ ఉంటుంది. సౌత్ లో రమ్యకృష్ణ, మీనా, ఇంద్రజ లాంటి వాళ్ళను ఉదాహరణగా తీసుకుంటే బాలీవుడ్ లో ముందు గుర్తొచ్చే పేరు ఐశ్యర్యరాయ్ తర్వాత మాధురి దీక్షితే. ఐష్ ఇటీవలే పొన్నియన్ సెల్వన్ 1లో తన మేజిక్ తో మరోసారి కట్టిపడేయడం కళ్ళముందు ఫ్రెష్ గానే ఉంది. రెండో భాగం మీద అభిమానులు ఆల్రెడీ బోలెడు అంచనాలు పెట్టేసుకున్నారు. ఇప్పుడు మాధురి వంతు వచ్చింది.

తన లేటెస్ట్ మూవీ మజా మా తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యింది. పెళ్లి కావాల్సిన యువకుడి తల్లి జీవితంలో అతని ప్రేమ వల్ల జరిగే సంఘటనల సమాహారంగా దర్శకుడు ఆనంద్ త్రిపాఠి దీన్ని తీర్చిదిద్దారు. మంచి ట్విస్టింగ్ పాయింట్ ఒకటి పెట్టుకుని ఓ ముప్పావు గంట బాగానే నడిపించిన ఆనంద్ తర్వాత తడబడిపోయి విసిగించేయడంతో మజా మాలో మజా పూర్తిగా మాయమైపోయింది. విపరీతమైన ల్యాగ్ తో అవసరమే లేని ఎన్నో సన్నివేశాలను పేర్చుకుంటూ వెళ్లి మొదట్లో కలిగిన ఫ్రెష్ ఫీలింగ్ ని చేతులారా పోగొట్టేశాడు. మాధురి స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత గొప్పగా ఉన్నా టేకింగ్ లో లోపాల వల్ల వృధా అయిపోయింది.

సినిమా ఎలా ఉందనేది కాసేపు పక్కనపెడితే 55 ఏళ్ళ వయసులోనూ మాధురి చలాకీతనం చూసి ఆశ్చర్యం కలగకమానదు. ముఖ్యంగా తన ప్రధాన బలమైన డాన్సుల్లో ఇప్పటికీ ఎనర్జీ తగ్గలేదని మరోసారి నిరూపించింది. కేవలం ఆవిడ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తప్ప ఈ మజామాలో సుదీర్ఘ ప్రహసనాన్ని తట్టుకోవడం కష్టం. ఎప్పుడో 1984లో ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఆల్ టైం బ్లాక్ బస్టర్ క్లాసిక్స్ లో భాగమైన మాధురి దీక్షిత్ రీఎంట్రీని ఇలాంటి వీక్ కంటెంట్ లో చూడాల్సిన రావడం విచారకరం. ఆ మధ్య ది ఫేమ్ గేమ్ అనే వెబ్ సిరీస్ లోనూ తనకు ఇలాంటి సమస్యే ఎదురయ్యింది. సరైన దర్శకుడు ఎప్పుడు దొరుకుతాడో !