లూసిఫర్ చూసే రండి.. నాకు భయం లేదు

కొంతమంది దర్శకులంతే. ఒక లెవెల్లో కాన్ఫిడెన్స్ చూపిస్తారు. అది సినిమా తీసేటప్పుడైనా, రిలీజప్పుడైనా సరే. ఇప్పుడు దర్శకుడు మోహన్ రాజా కూడా మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్ సినిమా గురించి అదే చెబుతున్నాడు. చూపిస్తున్నాడు. కావలంటే లూసిఫర్ సినిమాను మళ్ళీ చూసి ధియేటర్ కు రండి, అప్పుడు కూడా మీకు గాడ్‌ ఫాదర్ సినిమా చాలా కొత్తగా డిఫరెంటుగా ఉంటుందని చెబుతున్నాడు.

”నన్ను చిరంజీవిగారు గాడ్‌ ఫాదర్ రీమేక్ చెయ్యమని అడిగినప్పుడు, నేనే ఆ మలయాళం సినిమాను చూశాను. నాకెందుకో ఆ సినిమాలో కొత్త కోణం కనిపించింది. ఆ పాయింట్ తీసుకుని ఇప్పుడు గాడ్ ఫాదర్ సెకండాఫ్‌ లో చాలా మార్పులూ చేర్పులూ చేశాం. మీకు ఒక పది కొత్త క్యారక్టర్లు కనిపిస్తాయ్. గాడ్ ఫాదర్ తో పాటు వాళ్ళు కూడా లాస్టుకి విజయం సాధిస్తారు. ఒకవేళ మీరు ఫ్రెష్‌ గా మళ్ళీ లూసిఫర్ సినిమా చూసొచ్చినా కూడా, మీకు గాడ్‌ ఫాదర్ చాలా కొత్తగా ఉంటుంది” అంటూ ఇప్పుడు మోహన్ రాజా చెప్పడం ఆయన సినిమా రిజల్ట్ పై ఏ రేంజు కాన్ఫిడెన్సుతో ఉన్నాడో చెప్పకనే చెబుతోంది.

ఈ మధ్యకాలంలో చాలా రీమేక్ సినిమాలు ఆడియన్స్ ను అంతగా ఇంప్రెస్ చెయ్యట్లేదు. ఒరిజినల్ సినిమాకంటే పవర్ఫుల్ గా తీస్తేనే అటు పింక్ రీమేక్ వకీల్ సాబ్ అయినా, అయ్యాప్పానుం కోషియం రీమేక్ భీమ్లానాయక్ అయినా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశాయ్. ఇవి కాకుండా రీమేక్స్ గా వచ్చి చాలా చిన్నాచితకా సినిమాలు తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఎదురుదెబ్బలు తినేశాయ్. మరి గాడ్ ఫాదర్ ట్రైలర్లో కొన్ని షాట్స్ అదిరిపోయినా కూడా, ఎందుకో ఆ పవర్ మాత్రం అంతగా కనిపించలేదు. ఒకవేళ దర్శకుడు చెప్పినట్లు సినిమా ఫ్రెష్ గా ఉంటే మాత్రం మెగాస్టార్ ఈ దసరాకు భారీ హిట్టు కొట్టే ఛాన్సుంటుంది.

అసలే ఆడియన్స్ కూడా సినిమాల్లేక మంచి ఆకలి మీదున్నారు. పైగా దసరా సెలవులు కావడంతో యావరేజ్ టాక్ వచ్చినా కూడా సినిమాలను చూసేసే ఛాన్సుంది. చూద్దాం గాడ్‌ ఫాదర్ ఏం చేస్తాడో. ఈ నెల 5న సినిమా ధియేటర్లలో విడుదలవుతోంది.