గాడ్ ఫాదర్.. ఇదేమి ప్లానింగ్?


దసరా రేసులో ‘గాడ్‌ఫాదర్’, ‘ది ఘోస్ట్’ లాంటి పెద్ద సినిమాలకు తోడు.. ‘స్వాతిముత్యం’ అనే చిన్న సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సురేష్ తనయుడు, బెల్లకొండ శ్రీనివాస్ తమ్ముడు అయిన బెల్లంకొండ గణేష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా అది. గణేష్ నిర్మాత కొడుకు కావడం, ఈ సినిమాను డైరెక్ట్ చేసింది పెద్ద దర్శకుడేమీ కాకపోవడం, ఇది మాస్ మూవీ కాకపోవడం, బడ్జెట్ కూడా తక్కువే కావడంతో సినిమాకు మరీ హైప్ ఏమీ లేదు. ఒక సగటు చిన్న సినిమాలాగే దీన్ని రిలీజ్ చేస్తున్నారు.

ఇలాంటి సినిమాకు రెండు నెలల ముందే యుఎస్‌ డిస్ట్రిబ్యూషన్ డీల్ కన్ఫమ్ అయింది. రిలీజ్ ముంగిట సినిమాను చక్కగా ప్రమోట్ చేసుకుంటున్నాడు డిస్ట్రిబ్యూటర్. ఇక ‘ది ఘోస్ట్’ సినిమా విషయంలోనూ నిర్మాతలు ముందు చూపుతోనే వ్యవహరిస్తున్నారు. ముందే యుఎస్ బిజినెస్ డీల్ పూర్తి చేశారు. ప్రమోషన్లు అవీ కూడా ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయి.

కానీ దసరా రేసులో ఉన్న సినిమాలో పెద్ద రేంజ్ మూవీ, బడ్జెట్ సహా అన్ని విషయాల్లోనూ భారీతనం ఉన్న ‘గాడ్ ఫాదర్’ విషయంలో మాత్రం మిగతా రెండు దసరా చిత్రాలతో పోలిస్తే భిన్నమైన కథ నడుస్తోంది. విడు‌దలకు ఇంకో పది రోజులే మిగిలుండగా.. ఇప్పటిదాకా ‘గాడ్ ఫాదర్’ యుఎస్ డిస్ట్రిబ్యూటర్ ఎవరో తెలియదు. అసలు పబ్లిసిటీ అన్నదే లేదు. థియేటర్ల లిస్ట్ రిలీజ్ చేయలేదు. బుకింగ్స్ మొదలు కాలేదు. ఈపాటికి వేరే పెద్ద సినిమాకు థియేటర్ల లిస్ట్ రిలీజ్ చేసి.. బుకింగ్స్ మొదలుపెట్టి ప్రమోషన్లు హోరెత్తంచేవారు.

యుఎస్‌లో చిరంజీవికి మంచి ఫాలోయింగే ఉంది. పైగా ‘గాడ్ ఫాదర్’ మూవీలో సల్మాన్ ఖాన్ క్యామియో చేయడం వల్ల హిందీ ఆడియన్స్‌‌లోనూ ప్రత్యేక ఆసక్తి ఉంది. కానీ ఈ అడ్వాంటేజీని చిత్ర బృందం ఉపయోగించుకోవట్లేదు. ఎంత పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నా సరే.. యుఎస్ ప్రిమియర్స్ ద్వారా వచ్చే ఆదాయన్ని దృష్టిలో ఉంచుకుని ఒక స్పెషల్ టీంను పెట్టి బిజినెస్, ప్రమోషన్, ఇతర వ్యవహారాలను పర్యవేక్షించాల్సింది. కానీ అదేమీ చేయకుండా ఇలా సినిమాను గాలికి వదిలేయడం యుఎస్ ఆడియన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.