చెన్న‌కేశ‌వ‌రెడ్డి కోసం అడిగితే క‌న్నీళ్లు పెట్టుకుంద‌ట‌

20 ఏళ్ల ముందు నంద‌మూరి బాల‌కృష్ణ, వి.వి.వినాయ‌క్‌ల క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన సినిమా.. చెన్న‌కేశ‌వ‌రెడ్డి. ఆది లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేసిన వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో న‌ర‌సింహ‌నాయుడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టి ఊపుమీదున్న బాల‌య్య సినిమా చేస్తున్నాడ‌నేస‌రికి భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో ఓ పాత్ర చేయ‌మ‌ని అప్ప‌టి క‌థానాయిక ల‌య‌ను ద‌ర్శ‌కుడు వినాయ‌క్ అడిగితే.. ఆమె చాలా హ‌ర్ట‌యింద‌ట‌. క‌న్నీళ్లు కూడా పెట్టుకుంద‌ట‌. అందుక్కార‌ణం.. బాల‌య్య‌కు సోద‌రిగా న‌టించ‌మ‌ని వినాయ‌క్ అడ‌గ‌డ‌మేన‌ట‌. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ల‌డానికి బాల‌య్య సోద‌రి పాత్ర‌కు ల‌య లాంటి అమాయ‌కంగా క‌నిపించే అమ్మాయి అయితే బాగుంటుంద‌ని వినాయ‌క్‌కు అనిపించి.. రామోజీ ఫిలిం సిటీలో ఒక సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న ల‌య‌ను క‌లిసి విష‌యం చెప్పాడ‌ట‌.

ఐతే బాల‌కృష్ణ స‌ర‌స‌న క‌థానాయిక పాత్ర‌కు కాకుండా, చెల్లెలి పాత్ర‌కు త‌న‌ను అడ‌గ‌డంతో ల‌య నొచ్చుకుంద‌ట‌. తెలుగు హీరోయిన్లంటే ఎందుకు అంద‌రూ త‌క్కువ‌గా చూస్తారు, మేం హీరోయిన్లుగా ప‌నికిరామా, చెల్లెలు పాత్ర‌ల‌కే సూట‌వుతామా అంటూ ఆమె క‌న్నీళ్లు పెట్టుకుంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింద‌ట‌. ఐతే త‌న ఉద్దేశం అది కాద‌ని, ఈ పాత్ర‌కు మీరు బాగా సూట‌వుతార‌నే ఉద్దేశంతో అడిగాన‌ని, మ‌రోలా అనుకోవ‌ద్ద‌ని చెప్పాడ‌ట‌. మీరు హీరోయిన్‌గా వేరే సినిమా చేద్దాం అని చెప్పి వ‌చ్చేశాడ‌ట వినాయ‌క్. త‌ర్వాత ఈ పాత్ర‌కు త‌మిళ న‌టి దేవ‌యానిని అడ‌గ్గా.. ఆమె వెంట‌నే ఒప్పుకున్నార‌ట‌.

మ‌రోవైపు ట‌బు చేసిన పెద్ద బాల‌య్య భార్య పాత్ర‌కు సౌంద‌ర్య‌ను అడ‌గ్గా.. త‌ల్లి పాత్ర చేస్తే త‌ర్వాత అన్నీ అలాంటివే వ‌స్తాయ‌ని, ఇప్పుడే ఈ పాత్ర వ‌ద్ద‌ని సున్నితంగా తిర‌స్క‌రించింద‌ట‌. ట‌బును అడ‌గ్గా ఆమె వెంట‌నే ఓకే చేసింద‌ని వినాయ‌క్ తెలిపాడు. చెన్న‌కేశ‌వ‌రెడ్డి 20వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఈ నెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున స్పెష‌ల్ షోలు ప‌డ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.