ధనుష్ మొండి ధైర్యానికి కారణం

సెప్టెంబర్ చివరి వారం బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొంది. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 1తో నేరుగా ఢీ కొట్టేందుకు సెల్వ రాఘవన్ నేనే వస్తున్నాను ఒక రోజు ముందే 29న దింపుతున్నారు. ఈ క్లాష్ పట్ల మూవీ లవర్స్ ఏమంత హ్యాపీగా లేరు. కోలీవుడ్ బాహుబలిగా రికార్డులు సృష్టిస్తుందని ఆశలు పెట్టుకున్న పిఎస్ 1కి ఎక్కడ ధనుష్ గండి కొడతాడోనని టెన్షన్ పడుతున్నారు. పైగా ఎంత భారీగా కోట్లాది రూపాయలతో విజువల్ గ్రాండియర్ ని తీసినప్పటికీ మణి సార్ మూవీ మీద తమిళనాడులో తప్ప ఇంకెక్కడా అంత బజ్ లేదు. విక్రమ్ వేదా దెబ్బకు నార్త్ లో పట్టించుకునేవారు కనిపించడం లేదు

ఇంత రిస్క్ చేసి ధనుష్ ఎందుకు తెగిస్తున్నాడన్న అనుమానం లేకపోలేదు. దీనికి కారణాలున్నాయి. దసరాకు చాలా పెద్ద లాంగ్ వీకెండ్ రానుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఏడు నుంచి పది రోజుల దాకా పిల్లలకు సెలవులు ఇస్తున్నారు. అక్కడా అంతే. సో పండక్కు నాలుగైదు రోజులు ముందే రావడం కలెక్షన్ల పరంగా చాలా ప్లస్ అవుతుంది. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే కనక తర్వాత వారం పోటీగా ఎన్ని వచ్చినా భయపడాల్సిన పని లేదు. పైగా ధనుష్ టార్గెట్ స్వంత రాష్ట్రంలోనే ఎక్కువ. తిరు సక్సెస్ తర్వాత దాన్ని క్యాష్ చేసుకునే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.

ఈ పరిణామం ధనుష్ విక్రమ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో చిచ్చు పెట్టేసింది. లెజెండరీ దర్శకుడికి గౌరవం ఇవ్వకుండా కావాలని పోటీకి వస్తున్నందుకు కార్తీ అభిమానులు కూడా నిరసన ప్రకటిస్తున్నారు. బాహుబలి టైంలో మహేష్ బాబు తన శ్రీమంతుడుని రాజమౌళి కోసం వాయిదా వేసుకున్న వైనాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వస్తుందని తెలిసే చాలా టాలీవుడ్ మూవీస్ తమ షెడ్యూల్ ని మార్చుకోవడం ఎగ్జాంపుల్ గా చెబుతున్నారు. ఆ మాత్రం సహకారం ధనుష్ ఇస్తే పొన్నియన్ సెల్వన్ 1కు ఎంతో హెల్ప్ అవుతుందని వాళ్ళ వెర్షన్. తెలుగు అనువాదాన్ని అల్లు అరవింద సమర్పిస్తున్న సంగతి తెలిసిందే