7 సినిమాలతో దసరా జాతర

టాలీవుడ్లో మాములుగా ప్రతి సంక్రాంతికి విపరీతమైన కొత్త సినిమాల తాకిడి ఉంటుంది. ఇది మనకు అలవాటైన వ్యవహారమే. జనం భారీగా థియేటర్లకు వస్తారు కాబట్టి కౌంట్ ఎక్కువ తక్కువ ఎంతున్నా వసూళ్ల విషయంలో టెన్షన్ ఉండదు. కానీ ఈసారి ఆ పరిస్థితి దసరా పండుగకు వస్తోంది. ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు సినిమాలు బాక్సాఫీస్ బరిలో తలపడనున్నాయి. అక్టోబర్ 29 నుంచి 5 దాకా మూవీ లవర్స్ కి మాములు సంబరం ఉండదు. ఒకటి తప్ప అన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే కావడం మరో ట్విస్టు.అంచనాల విషయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ వీటన్నింటికి టాక్ చాలా కీలకం.

ముందుగా 29న ధనుష్ ‘నేనే వస్తున్నా’ దిగుతోంది. మొన్నటి దాకా అంచనాలు లేవు కానీ ట్రైలర్ వచ్చాక ఆసక్తి పెరిగిపోయింది. సెల్వ రాఘవన్ నుంచి మరో ఇంటెన్స్ డ్రామా వస్తోందన్న హామీ దొరికేసింది. మరుసటి రోజే 30న మణిరత్నం విజువల్ గ్రాండియర్ ‘పొన్నియన్ సెల్వన్ 1’ ఇండియా వైడ్ గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేసుకుంది. తెలుగులో ఇప్పటికైతే పెద్ద బజ్ లేదు. ఆ టైంకంతా ఎలా తీసుకొస్తారో చూడాలి. తమిళనాడులో మాత్రం ఓ రేంజ్ లో ఫీవర్ ఉంది. అదే రోజు కెజిఎఫ్ నిర్మాతలు హోంబాలే ఫిలింస్ ‘కంఠార’ని దించుతున్నారు. దీని బడ్జెట్ స్కేల్ కూడా పెద్దదే.

ఇక బాలీవుడ్ మూవీ ‘విక్రమ్ వేదా’ స్కెచ్చు భారీగా ఉంది. తర్వాత నాలుగు రోజుల గ్యాప్ తో అక్టోబర్ 5న చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’లు తలపడతాయి. ముందు డేట్లు మారొచ్చన్నారు కానీ ఫైనల్ గా ఢీ కొట్టేందుకే రెండు యూనిట్లు నిర్ణయించుకున్నాయి. బెల్లంకొండ గణేష్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన ‘స్వాతిముత్యం’ వీళిద్దరితో పోటీకి సై అనటం వెనుక కారణం ఊహకందటం లేదు. ఎలాంటి స్టార్ వేల్యూ లేకుండా కేవలం పెద్ద బ్యానర్ ప్రొడక్షన్ స్టాంప్ తో వస్తున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ ఏమైనా సర్ప్రైజ్ ఇస్తుందో ఏంటో. మొత్తానికి దసరా జాతర చాలా స్పెషల్ గా ఉండనుంది