వచ్చే నెల అక్టోబర్ 2 నుంచి పవన్ కళ్యాణ్ తలపెట్టిన బస్సు యాత్రను వాయిదా వేయడం ఆయన నిర్మాతల చెవుల్లో తేనే పోసినంత హాయిగా అనిపిస్తోంది. ప్రజా సమస్యలపైన మరింత అవగాహన కోసం సమయం అవసరం కావడంతో ఆ మేరకు పోస్ట్ పోన్ చేసుకుంటున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. రాజకీయాల సంగతి పక్కనపెడితే ఇది సినిమాల కోణంలో చాలా అంటే చాలా మేలు చేసే పరిణామం. హరిహర వీరమల్లు ఇంకా బ్యాలన్స్ ఉంది. నిర్మాత ఏఎం రత్నం బయటికి చెప్పకపోయినా తీవ్ర ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవం.
సో ఇప్పుడది ఫినిష్ చేయడానికి తగినంత సమయం దొరుకుతుంది. వేగంగా పూర్తి చేసి డబ్బింగ్ తదితర కార్యక్రమాల్లో పవన్ తరఫున చేయాల్సినవి త్వరగా పూర్తి చేసేయొచ్చు. వినోదయ సితం రీమేక్ ఉంటుందా లేదా అనేది అతి త్వరలో తేలిపోతుంది. బస్సు టూరు కారణంగానే ఇది పక్కన పెట్టేశారనే టాక్ వచ్చింది కానీ ఇప్పుడేం చేస్తారో చూడాలి. దీనికి రచన చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు ప్రాజెక్టులో తలమునకలయ్యారు. సో ఆయన ప్రమేయం ఇకపై పెద్దగా ఉండదు. సితారతో పాటు ఇందులో నిర్మాణ భాగస్వాములుగా ఉన్న బ్యానర్లు స్వయంగా వ్యవహారాలు చక్కదిద్దాల్సి ఉంటుంది.
ఇవన్నీ ఒక ఎత్తయితే భవదీయుడు భగత్ సింగ్ స్క్రిప్ట్ ని చేతిలో పట్టుకుని కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ కు సైతం ఇది ఉపశమనం కలిగించే వార్తే. రంగంలోకి దిగితే ఎక్కువ కాల్ షీట్లు అవసరం లేకుండా త్వరగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది వేసవిలోగా ఫస్ట్ కాపీ చేతిలో పెడతానని మైత్రి నిర్మాతలకు హామీ ఇచ్చాడట. ఇవన్నీ పవన్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడనే దాని మీదే ఆధారపడి ఉంటాయి. పవర్ స్టార్ పొలిటికల్ ట్రిప్ అయితే పక్కనపెట్టారు కానీ సినిమాల మీద అంతే సీరియస్ గా ఫోకస్ ని షిఫ్ట్ చేస్తారా అనేది వేచి చూడాలి.