ఆస్కార్ ప్రచారం – గాయం మాయం

గాడ్ ఫాదర్ అప్డేట్స్ విషయంలో కొణిదెల సంస్థ వహిస్తున్న నిర్లక్ష్యం పట్ల అభిమానులు ఎంత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారో గత రెండు రోజులుగా చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా వేదికగా మాములు తిట్లతో సరిపుచ్చడం లేదు. ఇక్కడ ప్రస్తావించలేనంత బూతు భావజాలం బలంగా వాడేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కానీ ఫ్యాన్స్ కి సర్దిచెప్పో సారీ చెప్పో ఎందుకిలా జరిగిందో వివరించే ప్రయత్నం కానీ ఏదీ జరగలేదు. రిలీజ్ కు ఇరవై రోజులు కూడా లేని ఒత్తిడిలో ఇలాంటి పరిణామాలు ఖచ్చితంగా నెగటివ్ పబ్లిసిటీకి దారి తీస్తాయి. ఈ ప్రభావం నేరుగా ఓపెనింగ్స్ మీద పడుతుంది.

అనూహ్యంగా గత ఇరవై నాలుగు గంటలకు పైగా రామ్ చరణ్ కు ఆస్కార్ నామినేషన్ వచ్చిందనే ప్రచారం ట్విట్టర్, ఇన్స్ టాలో ఊపందుకోవడంతో గాడ్ ఫాదర్ ఇష్యూ చల్లారిపోయింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు బయటికి వచ్చినప్పుడు మెగా ఫ్యాన్స్ అదంతా ఉత్థిదని తారక్ ఫ్యాన్స్ ని కవ్వించారు. ఇప్పుడు వాళ్ళ వంతు వచ్చింది. వెరైటీ అనే ఇంగ్లీష్ పత్రిక ఇచ్చిన లిస్టు ఒకటి పట్టుకుని అందులో తమ హీరోల పేర్లు చూపిస్తూ ఇద్దరూ నానా యాగీ చేస్తున్నారు. అదేదో నిజంగానే రేపో ఎల్లుండో చరణ్ తారక్ లలో ఒకరికి ఆస్కార్ ఇస్తారన్న రేంజ్ లో హడావిడి జరుగుతోంది.

ధృవ సినిమాలో చూపించినట్టు ఒక హాట్ ఇష్యూ ని సైడ్ ట్రాక్ చేయాలంటే మరో టాపిక్ ని చర్చలోకి తీసుకురావాలి. అప్పుడే జనం ముందుది ఈజీగా మర్చిపోతారు. గాడ్ ఫాదర్ గురించి గరం గరంగా ఉన్న మెగా ఫాన్స్ ఒక్కసారిగా చరణ్ ని డిఫెండ్ చేసుకునే పనిలో పడిపోయి తార్ మార్ తక్కర్ మార్ పాట సంగతే మర్చిపోయారు. స్పాటిఫైలో వచ్చి ఇరవై నాలుగు గంటలు దాటేసినా ఇప్పటిదాకా యూట్యూబ్ తాలూకు లిరికల్ వీడియో ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. ఇంతకీ ఈ అలసత్వం నిర్లక్ష్యం ఇలా పాటల వరకే పరిమితం చేస్తారో లేక అక్టోబర్ 5 కూడా ఏమైనా పొరపాట్లు చేస్తారో వారికే తెలియాలి.