ర‌ణ‌బీర్ ఫెయిల్.. ఓవ‌ర్ టు హృతిక్

క‌రోనా బ్రేక్ త‌ర్వాత బాలీవుడ్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న భారీ చిత్రాలు వ‌రుస‌గా బోల్తా కొట్టాయి. 83, ర‌న్ వే 34, బ‌చ్చ‌న్ పాండే, పృథ్వీరాజ్, షంషేరా, లాల్ సింగ్ చ‌డ్డా.. ఇలా భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన సినిమాల‌న్నీ నిరాశ‌కు గురి చేశాయి. ది క‌శ్మీర్ ఫైల్స్, భూల్ భుల‌యియా-2 లాంటి చిన్న, మీడియం రేంజ్ చిత్రాలే మంచి వ‌సూళ్లు రాబ‌ట్టాయి.

వ‌రుస‌గా షాక్‌ల మీద షాక్‌లు తిన్న‌బాలీవుడ్.. గ‌త వారం విడుద‌లైన బ్ర‌హ్మాస్త్ర మీద భారీ ఆశ‌లు పెట్టుకుంది. ఈ సినిమాకు జ‌రిగిన అడ్వాన్స్ బుకింగ్స్, తొలి వీకెండ్లో వ‌చ్చిన వ‌సూళ్లు చూసి ట్రేడ్ పండిట్లు ఆశ్చ‌ర్య‌పోయారు. డివైడ్ టాక్‌తోనూ ఇలాంటి వ‌సూళ్లేంట‌ని ముక్కున వేలేసుకున్నారు. కానీ ఈ దూకుడంతా వీకెండ్‌కే ప‌రిమితం అయింది.

వారాంతం అయ్యాక బ్ర‌హ్మాస్త్ర బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చ‌తికిల‌ప‌డింది. ఇక ఈ సినిమా పెద్ద‌గా పుంజుకునే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మిన‌హాయిస్తే బ్ర‌హ్మాస్త్ర బ‌య్య‌ర్ల‌కు పెద్ద ఎత్తున న‌ష్టాలు త‌ప్ప‌ట్లేదు. దీంతో సినిమాను న‌మ్ముకున్న వాళ్లంద‌రూ విషాదంలో ఉన్నారు. వీకెండ్ జోరు చూసి ర‌ణ‌బీర్ సినిమాకు ఎలివేష‌న్ ఇచ్చిన వాళ్లంతా సైలెంట్ అయిపోయారు. కొంచెం గ్యాప్ ఇచ్చి బాలీవుడ్ అంతా కూడా కొత్త సినిమా మీదికి ఫోక‌స్ మ‌ళ్లించింది. ఆ సినిమానే.. విక్ర‌మ్ వేద‌.

హృతిక్ రోష‌న్, సైఫ్ అలీ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ చిత్రం అదే పేరుతో త‌మిళంలో విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించిన సినిమాకు రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. దీని ట్రైల‌ర్ మాస్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ర్షించింది. ముఖ్యంగా హృతిక్ పాత్ర‌, అత‌డి స్క్రీన్ ప్రెజెన్స్, న‌ట‌న హైలైట్‌లాగా క‌నిపించాయి. సినిమా భార‌మంతా అత‌డిమీదే ఉంది. భారీ అంచ‌నాలున్న చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్ ఏకంగా 100 దేశాల్లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇది ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే రికార్డు అంటున్నారు. మేక‌ర్స్‌కు సినిమా మీద ఉన్న న‌మ్మ‌కానికి ఇది నిద‌ర్శ‌నం అని చెప్పొచ్చు. ఈ నెల 30న విక్ర‌మ్ వేద ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.