రొమాన్స్ విమర్శలపై రకుల్ రియాక్షన్

సూపర్ స్టార్లలో ఒకరైన అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన కొత్త చిత్రం‘కట్ పుట్లి’. ఇందులో అక్షయ్ సరసన రకుల్ ప్రీత్ కథానాయకిగా నటించింది. తమిళ చిత్రం ‘రాక్షసన్’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘కట్ పుట్లి’ థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా హాట్ స్టార్ ఓటీటీలో ఈ నెల 2న రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు చాలావరకు నెగిటివ్ టాక్ వచ్చింది.

ఒరిజినల్ తో పోలిస్తే అంత ఇంపాక్ట్ లేదని విమర్శించారు చాలామంది. ముఖ్యంగా రాక్షసన్’ లో ఉన్న ఇంటెన్సిటీ ఇందులో మిస్ అయిందని అన్నారు. అందుకు ఒక కారణంగా అక్షయ్-రకుల్ మధ్య వచ్చే సన్నివేశాలను చూపించారు. ఇంత సీరియస్ సినిమాలో అక్షయ్ రకుల్ మధ్య రొమాన్స్ ఏంటి అనే విమర్శలు వచ్చాయి.

ఈ విమర్శలపై తాజాగా రకుల్ స్పందించింది. ‘కట్ పుట్లి’లో రొమాంటిక్ సీన్లు పెట్టడం తప్పేమీ కాదని రకుల్ అభిప్రాయపడింది. సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు రకరకాల అంశాలు కోరుకుంటారని.. కామెడీ.. యాక్షన్.. రొమాన్స్ ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుందని.. మొత్తంగా చెప్పాలంటే ఇండియన్ సినిమాల్లో ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ ఆశిస్తారని రకుల్ పేర్కొంది.

క్రైమ్ థ్రిల్లర్ అయినా సరే మధ్యలో రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ ఉంటే రిలీఫ్ లాగా ఫీల్ అవుతారని.. అందుకే తమ చిత్రంలో రొమాంటిక్ సీన్లు పెట్టామని… ఈ విషయంలో వివాదం అనవసరమని.. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా సినిమా తీర్చిదిద్దామని రకుల్ క్లారిటీ ఇచ్చింది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.