నయనతార వచ్చే ఛాన్స్ ఉంది

నటించే సినిమా ఏదైనా సరే ఒక్కసారి షూటింగ్ అయిపోయాక ప్రమోషన్లతో మాత్రం తనకే సంబంధం లేదన్నట్టు వ్యవహరించే శైలి నయనతారది. అప్పుడెప్పుడో శ్రీరామ రాజ్యంకు మాత్రమే కొంత మినహాయింపు ఇచ్చింది. అది కూడా సీనియర్ దర్శకులు బాపు గారి మీద గౌరవంతో ప్లస్ సీత క్యారెక్టర్ చేసిన అభిమానంతో అంతే. సైరా నరసింహారెడ్డిని భారీ ఎత్తున రిలీజ్ చేసినప్పుడు అందులో మెయిన్ హీరోయిన్ గా నటించిన నయన్ పొరపాటున కూడా ఒక ప్రెస్ మీట్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గాని వచ్చిన దాఖలాలు లేవు. బాలయ్య, వెంకీ, నాగ్, తారక్, ప్రభాస్ అందరికీ అదే ట్రీట్మెంట్.

ఇప్పుడు గాడ్ ఫాదర్ వంతు వచ్చింది. ఇంకో పాతిక రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. రేపో ఎల్లుండో ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నారు. 12న ఫస్ట్ ఆడియో సింగల్ తాలూకు అప్ డేట్ రానుంది. ముందస్తు విడుదల వేడుకకు పవన్ కళ్యాణ్ రావడం దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. జనసేనాని డేట్లు చెక్ చేస్తున్నారు. మరి ఇంత గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇప్పుడైనా నయన్ వస్తుందా అంటే కొట్టిపారేయలేం అంటున్నాయి చెన్నై వర్గాలు. దానికి కారణం ఉంది. గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజాకు నయనతారతో మంచి బాండింగ్ ఉంది.

ఈ ఇద్దరి కాంబోలో తని ఒరువన్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. దీన్నే తెలుగులో రామ్ చరణ్ ధృవగా రీమేక్ చేశారు. సో మాతృబాష డైరెక్టర్ అందులోనూ బ్లాక్ బస్టర్ ఇచ్చిన వ్యక్తి అడిగితే మొహమాటానికైనా ఓసారి వచ్చే ఛాన్స్ ఉంది. పైగా విఘ్నేష్ శివన్ తో పెళ్ళయాక తెలుగు మీడియాని ఫ్యాన్స్ ని కలుసుకునే అవకాశం రాలేదు. ఈ రూపంలో దాన్ని వాడుకోవచ్చు. ఇదంతా నయన్ అందుబాటులో ఉండటం మీద ఆధారపడి ఉంది. చిరంజీవి జోడిగా కాకపోయినా ఆయన సోదరిగా నయనతార చేసిన పాత్ర గాడ్ ఫాదర్ లో చాలా కీలకం. ఒరిజినల్ లో మంజు వారియర్ చేశారు.