పవన్ కు అంత టైమ్ ఎక్కడిది

ఇవాళ ఉదయం ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ సాహో దర్శకుడు సుజిత్ కాంబోలో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం ఊపందుకోవడంతో అభిమానులు షాక్ తిన్నారు. అది కూడా డివివి దానయ్య బ్యానర్ లో అనగానే మరింత ఆశ్చర్యం. అసలు ఈ కాంబో గురించిన లీకులు కానీ చర్చలు కానీ ఇండస్ట్రీలో ఎప్పుడూ జరగలేదు. అలాంటిది ఈ న్యూస్ వైరల్ కావడం నిజంగానే ఊహించనిది. దెబ్బకు డివివి సంస్థ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తమ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి వచ్చే ఎలాంటి ప్రచారాలను నమ్మొద్దంటూ క్లారిటీ వచ్చింది. అప్పుడు కానీ ఫ్యాన్స్ కు స్పష్టత రాలేదు. ఇది నమ్మినవారు కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారు.

పవన్ కు నిజంగానే కొత్త సినిమాలు ఒప్పుకునేంత తీరికా ఓపికా లేవు. ఒకవేళ ఎన్నికల కోసం డబ్బులు కావాలనుకున్నా సరే వరసబెట్టి తోచినన్ని చేసేంత వెసులుబాటు లేదు. అసలు హరిహర వీరమల్లే ఎప్పుడు పూర్తవుతుందో అర్థం కావడం లేదు. హరీష్ శంకరేమో వస్తాం కొడతాం అంటూ భవదీయుడు భగత్ సింగ్ గురించి ఊరిస్తున్నాడు. వినోదయ సితం రీమేక్ ఉంటుందా లేదానేది ఎవరూ తేల్చి చెప్పడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే నిర్మాత రామ్ తాళ్ళూరి దర్శకుడు సురేందర్ రెడ్డితో ప్లాన్ చేసుకున్న పవన్ మూవీ డ్యూ లిస్ట్ లో ఉంది.

కాసేపు వీటిని పక్కనపెడితే ఎన్నికలకు అట్టే టైం లేదు. ఇంకో ఏడాదిన్నర కళ్ళు మూసుకుంటే ఏపి ఎలక్షన్లు వస్తాయి. పొత్తులు, ప్రచార సరళి, అభ్యర్థుల ఎంపిక, కమిటీలు, బాధ్యతలు, పార్టీ టికెట్లు ఇలా లక్షా తొంబై వ్యవహారాలు స్వయంగా పవన్ చూసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి సినిమాలకు సంతకం చేసే టైం ఎక్కడిది. అభిమానులు మాత్రం ఏది చేసినా చేయకపోయినా ముందు హరిహరవీరమల్లుని పూర్తికానిచ్చి ఆ తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోమంటున్నారు. రెండు రీమేకులు చాలని, ఒక ప్యాన్ ఇండియా మూవీతో బ్రేక్ తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. చూడాలి మరి పవన్ మనసులో ఏముందో.