పూరీకి ఇంకో ఆప్షన్ లేదు మరి

పూరి జగన్నాథ్ పరిస్థితి ఉన్నట్లుండి మళ్లీ తలకిందులైంది. ‘టెంపర్’ తర్వాత చాలా ఏళ్లు సక్సస్ లేక ఆయన చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటి టైంలో ‘ఇస్మార్ట్ శంకర్’ ఆయన కెరీర్‌కు మళ్లీ ఊపిరులూదింది. ఆ దశలో ఆయనకు అది అత్యావశ్యకం విజయం అనే చెప్పాలి. దీంతో ఆయన కెరీర్ మల్లీ గాడిన పడ్డట్లే కనిపించింది. విజయ్ లాంటి యూత్‌లో మంచి క్రేజున్న హీరో దొరకడం, కరణ్ జోహార్ లాంటి టాప్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ లభించడంతో ‘లైగర్’ను భారీ స్థాయిలో తీసే అవకాశం దక్కింది.

ఈ సినిమాకు బోలెడంత క్రేజ్ కూడా వచ్చింది. కానీ వీటిని పూరి ఉపయోగంచుకోలేకపోయాడు. చాలా సాధారణమైన సినిమా తీశాడు. పూరి ఇంతకుముందు డిజాస్టర్లు ఇచ్చినా.. వాటి గురించి మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరగలేదు. తక్కువ బడ్జెట్లో, తక్కువ రోజుల్లో సినిమా తీసేయడం.. నష్టాలు కూడా తక్కువే కావడం.. సినిమా పోగానే ఇంకో ప్రాజెక్ట్ సెట్ చేసుకుని ముందుకు వెళ్లిపోవడం వల్ల పూరి బండి నడిచిపోయింది. కానీ ‘లైగర్’ ఆయనకు చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు.

ఈ సినిమాతో పూరికి భారీ నష్టాలు తప్పట్లేదు. పేరు బాగా దెబ్బ తింది. ఆయన్ని నమ్మి పేరున్న హీరోలు, నిర్మాతలు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇలా అన్ని రకాలుగా పూరికి డ్యామేజ్ జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆయన తన కొడుకు పూరి ఆకాశ్‌ను హీరోగా పెట్టి ఒక కొరియన్ మూవీని రీమేక్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ దశలో ఆయనకు ఇంతకంటే ఆప్షన్ కూడా లేదనే చెప్పాలి.

‘లైగర్’ లాంటి సినిమా తీశాక పూరీతో సినిమా చేయడానికి కాస్త పేరున్న ఏ హీరో కూడా సాహసించడు. మరోవైపు తండ్రి చిత్రం ‘మెహబూబా’తో హీరోగా పరిచయం అయిన ఆకాశ్.. ఆ తర్వాత రొమాంటిక్, చోర్ బజార్ చిత్రాలతో చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. అతడితో సినిమా తీయడానికి వేరే దర్శకులు, నిర్మాతలు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కొడుకుతో తండ్రి.. తండ్రితో కొడుకు జట్టు కట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఈ సినిమాతో తాను బౌన్స్ బ్యాక్ కావడమే కాక కొడుకుకు కూడా హిట్టిస్తే అంతకంటే పూరికి, ఆయన అభిమానులకు కావాల్సిందేముంది?