ఉప్పెనతో ఊహించిన దానికన్నా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ కు షాక్ తగిలేందుకు అట్టే సమయం పట్టలేదు. కొండపొలం రూపంలో మోస్ట్ ఎలిజిబుల్ డైరెక్టర్ క్రిష్ అంతటివాడే డిజాస్టర్ ఇచ్చినప్పుడు తను మాత్రం ఏం చేయగలడు. పైగా అందులో యాక్టింగ్ పరంగా వైష్ణవ్ మీద కామెంట్స్ బలంగానే వినిపించాయి. అందుకే ఈసారి ప్రయోగాల జోలికి పోకూడదని శుభ్రంగా ఎంటర్ టైనర్ వైపుకు వచ్చేశాడు. నిన్న వచ్చిన రంగ రంగ వైభవంగా ట్రైలర్ అంచనాలు తగ్గించడం పెంచడం రెండూ చేయలేదు.
నిజానికి అందులో ఉన్నదంతా ఓల్డ్ ఫార్ములానే ఫీలింగే కలిగించింది. హీరో హీరోయిన్ చిన్నప్పటి నుంచి తగవులాడుకోవడం పెద్దయ్యాక ఒకే కాలేజీలో చేరాక ప్రేమ చిగురించడం, రెండు కుటుంబాల మధ్య మంచి ఫ్రెంఢ్ షిప్, వీటితో పాటు రెండు మూడు ట్విస్టులు ఇలా సాగిపోయింది. ఒకప్పుడు ఇది బ్లాక్ బస్టర్ ఫార్ములా. నువ్వే కావాలి, ఆనందం లాంటి లో బడ్జెట్ మూవీస్ ఈ లైన్ మీదే రూపొంది రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టుకున్నాయి. తర్వాత అందరూ వాడేసరికి అవుట్ డేటెడ్ అయిపోయి పక్కకు తప్పుకుంది.
మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత దర్శకుడు గిరిశాయ దీన్ని తీసుకున్నాడు. సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్ గా పని చేసి దాని తమిళ రీమేక్ ఆదిత్య వర్మతో డైరెక్టర్ గా డెబ్యూ చేసిన ఇతనికి టాలీవుడ్ లో ఇదే మొదటి మూవీ. ఇంత సింపుల్ లైన్ తో మేజిక్ చేయాలంటే హిలేరియస్ ఎంటర్ టైన్మెంట్ ఉండాలి. హీరోయిన్ కేతిక శర్మ లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మీద అంచనాలున్నాయి. మరి వర్కౌట్ చేసేసిన ఫార్ములాని ఇప్పటి జెనరేషన్ కి తగ్గట్టు ఎలా చూపిస్తారో మరి. వైష్ణవ్ కు సైతం ఇది హిట్ కావడం చాలా కీలకం.