పొన్నియన్ సెల్వన్.. తమిళ సినీ చరిత్రలోనే అతి పెద్ద బడ్జెట్ చిత్రాల్లో ఒకటి. ఇది ఆ ఇండస్ట్రీకి బాహుబలి లాగా అభివర్ణిస్తున్నాడు అక్కడి సినీ జనాలు. బాహుబలితో అనేక రకాలుగా దీనికి పోలిక కనిపిస్తోంది. ఐతే మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుడు తీస్తున్న సినిమాను.. రాజమౌళి చిత్రంతో పోల్చడం, జక్కన్నను అనుకరిస్తున్నట్లుగా పేర్కొనడం అంటే ఆయన్ని తక్కువ చేయడమే అనే వాళ్లూ లేకపోలేదు. ఈ విషయంలో తమిళ జనాల ఇగో హర్ట్ అవుతోంది. కానీ మణిరత్నం మాత్రం అలాంటి అహానికి పోకుండా రాజమౌళిని కొనియాడడం విశేషం.
తాను పొన్నియన్ సెల్వన్ సినిమా పూర్తి చేయడానికి ఒక రకంగా రాజమౌళినే బాటలు పరిచినట్లు మణిరత్నం వ్యాఖ్యానించాడు. పొన్నియన్ సెల్వన్ నుంచి కొత్త పాటను లాంచ్ చేయడానికి తన టీంతో కలిసి మణిరత్నం శుక్రవారం హైదరాబాద్ వచ్చారు.
ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ.. బాహుబలి సినిమా ద్వారా భారీ బడ్జెట్లో సినిమాలు తీయడానికి బాటలు పరిచిన ఘనత రాజమౌళికి దక్కుతుందని అన్నారు.
తాను పొన్నియన్ సెల్వన్ సినిమాను రెండు భాగాలుగా భారీ బడ్జెట్లో తెరకెక్కించడానికి ధైర్యాన్నిచ్చింది బాహుబలే అని మణిరత్నం వ్యాఖ్యానించారు. ఇందుకు రాజమౌళికి థ్యాంక్స్ చెప్పారాయన. మరోవైపు మెగాస్టార్ చిరంజీవికి సైతం మణిరత్నం థ్యాంక్స్ చెప్పారు. ఐతే చిరుకు తాను ఎందుకు థ్యాంక్స్ చెబుతున్నానన్నది మాత్రం మణిరత్నం వెల్లడించలేదు.
ఇందుకు కారణమేంటో తర్వాత తెలుస్తుందని అన్నారాయన. బహుశా పొన్నియన్ సెల్వన్‌కు చిరు వాయిస్ ఓవర్ ఇచ్చి ఉంటాడని భావిస్తున్నారు. విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తి, త్రిష, జయం రవి, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, పార్తీబన్, ప్రభు, విక్రమ్ ప్రభు, శోభిత దూళిపాళ్ల.. ఇలా భారీ తారాగణమే ఉందీ చిత్రంలో. రెండు భాగాలకు కలిపి రూ.500 కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నారు. మణిరత్నం మద్రాస్ టాకీస్‌తో కలిసి సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ బేనర్లలో ఒకటైన లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సెప్టెంబరు 30న పొన్నియన్ సెల్వన్-1 విడుదల కానుంది.