పూరీ సార్.. ఈ హంగామా చూస్తున్నారా?

ఒక బద్రి.. ఒక ఇడియట్.. ఒక అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి.. ఒక పోకిరి.. ఒక దేశముదురు.. మామూలు హిట్లిచ్చాడా పూరి జగన్నాథ్? ఆ సినిమాలతో సాధించిన విజయాలను పక్కన పెడితే ఆయన చిత్రాల్లో హీరోలను ప్రెజెంట్ చేసిన తీరు.. వాళ్ల క్యారెక్టరైజేషన్.. ఆ యాటిట్యూడ్.. ఇలా ప్రతి విషయంలో ఆయన ట్రెండ్ సెట్ చేశాడు. పూరి కెరీర్లో మిగతా సినిమాలన్నీ ఒకెత్తయితే.. ‘పోకిరి’ ఇంకో ఎత్తు. పూరీతో మహేష్ కాంబినేషన్ లో సినిమా అన్నపుడు.. ఆ సినిమా పూర్తయి విడుదలకు సిద్ధమైనపుడు.. రిలీజ్ తర్వాత కొన్ని రోజుల వరకు ఈ చిత్రం అంతటి సంచలనం రేపుతుందని ఎవ్వరూ అనుకోలేదు.

వారాల తరబడి హౌస్ ఫుల్స్‌తో నడిచి.. 50, 100 రోజుల సెంటర్లతో పాటు కలెక్షన్ల రికార్డులు అన్నింటినీ బద్దలు కొట్టేసి అప్పటికి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘మగధీర’ దీన్ని అధిగమించింది. ఐతే ‘మగధీర’లోని భారీ కథ.. ఆ సెటప్ అన్నీ కూడా వేరు. కానీ మాఫియా నేపథ్యంలో సింపుల్ స్టోరీతో పూరి చేసిన మ్యాజిక్, ఆ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

‘పోకిరి’ రిలీజై 16 ఏళ్లు దాటిపోగా.. మళ్లీ ఇప్పుడు ఆ చిత్రం హాట్ టాపిక్‌గా మారింది. మహేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక చెన్నై, బెంగళూరు లాంటి సిటీల్లో, అలాగే యుఎస్‌లో పలు లొకేషన్లలో కలిపి వందల సంఖ్యలో స్పెషల్ షోలు వేశారు. ఆ షోలకు ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి అందరూ ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. థియేటర్లలో మాస్ సెలబ్రేషన్స్ అంటే ఎలా ఉంటాయో చూపించారు మహేష్ ఫ్యాన్స్. ‘పోకిరి’లో మహేష్ చూపించిన ఎనర్జీకి మరోసారి ఫిదా అవుతూ.. ఇప్పుడు మళ్లీ అతణ్ని అంతటి ఎనర్జీతో చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. అదే సమయంలో పూరి గురించి కూడా పెద్ద చర్చే నడుస్తోంది.

ఆయన్నుంచి కూడా అలాంటి షార్ప్ కథ.. రేసీ స్క్రీన్ ప్లే.. తన మార్కు హీరోయిజం.. ఎలివేషన్లు, యాక్షన్.. ఉన్న సినిమాలను అభిమానులు కోరుకుంటున్నారు. ‘పోకిరి’ రోజుల్లోని వింటేజ్ పూరి తమకు కావాలని అంటున్నారు. తన సినిమా ఇన్నేళ్ల తర్వాత రేపుతున్న సంచలనాలను పూరి అసలేమీ పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కనీసం ఈ రెస్పాన్స్ చూసి ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. ఆయన దృష్టంతా ‘లైగర్’ మీదే ఉంది. మరి ఆ సినిమాలో అయినా పూరి తన మార్కు చూపించాడా? ‘పోకిరి’ స్థాయిలో కాకపోయినా దానికి దగ్గరగా నిలిచే సినిమాను ఆయన తీశాడా? ఈ నెల 25న పూరి అభిమానులు కాలర్ ఎగరేసుకుని బయటికి వస్తారా? వేచి చూద్దాం.