త్రిష‌.. 14 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ

అంతా అనుకున్న ప్రకారం జ‌రిగితే త్రిష పెళ్లి అయిదేళ్ల ముందే అయిపోయి ఉండాలి. అంత‌టితో ఆమె సినిమా కెరీర్ కూడా ముగియ‌బోతోంద‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. నిజానికి అప్ప‌టికే ఆమెకు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. హీరోయిన్‌గా త‌న క‌థ ముగిసిన‌ట్లే అన్న సంకేతాలు క‌నిపించాయి. కానీ కార‌ణాలేంటో కానీ.. త్రిష వ‌రుణ్ మ‌ణియ‌న్‌తో త‌న నిశ్చితార్థాన్ని ర‌ద్దు చేసుకుంది.

త‌ర్వాత ఆమెకు అవ‌కాశాలు పెరిగాయి. వ‌య‌సు మీద ప‌డ్డ‌ప్ప‌టికీ, జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా, విరామం లేకుండా సినిమాలు చేసుకుంటూ సాగిపోతోంది. త్వ‌ర‌లోనే ఆమె మ‌ణిర‌త్నం సినిమా పొన్నియ‌న్ సెల్వ‌న్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ క‌థ‌లో అత్యంత కీల‌క‌మైన పాత్ర‌నే త్రిష చేస్తోంది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంది కాబ‌ట్టి త్రిష అందులోనూ త‌ళుక్కుమ‌న‌బోతోంది. కెరీర్లో ఈ ద‌శ‌లో ఇంత పెద్ద సినిమాలో హీరోయిన్ పాత్ర చేయ‌డం విశేష‌మే.

ఐతే ఇప్పుడు త్రిష మ‌రో భారీ సినిమాలో అవ‌కాశం ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. త‌మిళంలో ప్ర‌స్తుతం నంబ‌ర్ వ‌న్ హీరో అన‌ద‌గ్గ విజ‌య్‌తో ఆమె జ‌ట్టు క‌ట్ట‌బోతోంద‌ట‌. వీరిది కొత్త జంటేమీ కాదు. గిల్లి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో పాటు తిరుపాచ్చి, ఆతి, కురువి అనే మ‌రో మూడుచిత్రాల్లో క‌లిసి న‌టించారు. చివ‌ర‌గా వీరి కాంబినేష‌న్లో వ‌చ్చిన సినిమా కురువి 2008లో రిలీజైంది.

ఆ త‌ర్వాత వీరి క‌ల‌యిక‌లో సినిమా రాలేదు. ఐతే ఇప్పుడు విజ‌య్.. లోకేష్ క‌న‌క‌రాజ్ దర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సినిమాకు త్రిష‌నే క‌థానాయిక‌గా ఎంచుకున్న‌ట్లు స‌మాచారం. విజ‌య్‌తో ఇప్ప‌టికే మాస్ట‌ర్ లాంటి హిట్ ఇచ్చిన లోకేష్‌… విక్ర‌మ్ లాంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత అత‌డితో మ‌ళ్లీ జ‌ట్టు క‌డుతుండ‌డంతో ఆ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లితో చేస్తున్న వార‌సుడు తర్వాత విజ‌య్ న‌టించ‌నున్న చిత్ర‌మిదే. ఇందులో త్రిష‌కు పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న కీల‌క పాత్ర ఇస్తున్నాడ‌ట లోకేష్‌.