మునుగోడులో రేవంత్ బీసీ కార్డ్‌.. దిమ్మ‌తిరిగిన రాజ‌కీయం!

కాంగ్రెస్ తెలంగాణ అధ్య‌క్షుడు.. రేవంత్ రెడ్డి వేసిన వ్యూహం.. రాజ‌కీయ పార్టీల‌కు దిమ్మ‌తిరిగేలా చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అగ్ర‌వ‌ర్ణాల‌కు చెందిన వారే ప్రాతినిథ్యం వ‌హిస్తున్న మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంపై రేవంత్ బీసీ కార్డును ప్ర‌యోగించారు. దీంతో ఇప్పుడు రాజ‌కీయాల‌న్నీ.. కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతున్నాయనే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా కాంగ్రెస్ నేత‌, మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.. పార్టీకి రిజైన్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక ఎమ్మెల్యే ప‌ద‌విని కూడా ఆయ‌న వ‌దుల‌కుంటున్నారు.

దీంతో మునుగోడులో ఉప ఎన్నిక ఖాయంగా క‌నిపిస్తోంది. దీంతో ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకునేందుకు.. మూడు పార్టీలు కూడా తీవ్ర‌స్థాయిలో శ్ర‌మిస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్‌.. ఇప్ప‌టికే అభివృద్ది మంత్రం జ‌పిస్తోంది. మ‌రోవైపు.. బీజేపీ పూర్తిగా.. కోమ‌టిరెడ్డిపైనే ఆధార‌ప‌డుతోంది. ఇలాంటి స‌మయంలో.. అనూహ్యంగా.. నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న సామాజిక వ‌ర్గాల ప‌ట్టు-బెట్టుల‌పై.. రేవంత్ దృష్టి పెట్టారు. ఇక్క‌డ బీసీ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌. అదేస‌మ‌యంలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గం కూడా ఉంది.

ఈ క్ర‌మంలో ఈ వ‌ర్గాల‌ను ఆక‌ర్షించేలా.. రేవంత్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన చెరుకు సుధాక‌ర్‌కు రేవంత్ టికెట్ ఇచ్చేలా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఫ‌లితంగా రెం డు నుంచి మూడు మార్గాల్లో ఓట్ల‌ను ఒడిసి ప‌ట్టుకునేందుకు రేవంత్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో ఓటు బ్యాంకును ప‌రిశీలిస్తే.. ఇక్క‌డ 50శాతానికి పైగా.. బీసీలు ఉన్నారు.

గౌడ‌ల ఓట్లు 35 వేలు
పద్మశాలీ ఓట్లు 32 వేలు
ముదిరాజ్  ఓట‌ర్లు 31 వేల‌ మంది
యాదవ సామాజిక వర్గం ఓట్లు 26 వేలు ఉన్నాయి. అంటే.. మొత్తంగా.. లక్షా 50 వేల మంది బీసీ ఓటర్లే ఉన్నారు.

అదేస‌మ‌యంలో మాదిగలు 25 వేల వరకు ఉన్నారు
మాలలు 11 వేల ఓటర్లు ఉన్నారు. ఎస్టీలు 11 వేల వరకు ఉన్నారు. మైనార్టీ వర్గానికి చెందిన 6 వేల మంది ఓటర్లు ఉన్నారు.

మొత్తంగా మునుగోడు నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాల వారే 90 శాతానికి పైగా ఉన్నారు. ఇక‌, అగ్ర‌వ‌ర్ణ ఓట‌ర్ల‌లో 7 వేల 6  వందలు కాగా.. కమ్మవారు  దాదాపు 5 వేల మంది ఉన్నారు. వెలమ ఓటర్లు రెండున్నర వేలు ఉండగా.. ఆర్యవైశ్య, బ్రహ్మణ సామాజికవర్గాల నుంచి మరో 4 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిని ప‌క్క‌న పెడితే.. బీసీ ఓట్ల‌ను త‌న‌వైపు తిప్పుకొంటే.. ఫ‌లితం పాజిటివ్ అవుతుంద‌ని.. రేవంత్ భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో బీసీ వ‌ర్గానికి చెరుకు సుధాక‌ర్‌కు కండువా క‌ప్పిన వెంట‌నే టికెట్ విష‌యాన్ని అధిష్టానం వ‌ద్ద రేవంత్ ప్ర‌స్తావించిన‌ట్టు తెలిసింది. ఇప్ప‌టి వ‌ర‌కు మునుగోడులో బీసీ వ‌ర్గానికి కీల‌క పార్టీలు టికెట్లు ఇవ్వ‌లేదు. గ‌తంలో కాంగ్రెస్ పాల్వాయి గోవ‌ర్ధ‌న్‌రెడ్డికి, కాంగ్రెస్.. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికే టికెట్ ఇచ్చాయి. దీంతోఇక్క‌డ బీసీ వ‌ర్గం త‌మ వారికి కూడ టికెట్ ఇవ్వాల‌ని.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఒత్తిడి పెంచింది. అయితే.. ఇప్పుడు రేవంత్‌.. ఇదే టార్గెట్ చేసుకుని.. బీసీ వ‌ర్గానికి అనుకూలంగా చ‌క్రం తిప్పుతున్నార‌ని అంటున్నారు. దీంతో ఇక్క‌డ విజ‌యం కాంగ్రెస్‌ను వ‌రించ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.