తెలంగాణ‌లో టికెట్ రేట్లు.. ఇలా ఫిక్స‌యిపోవ‌చ్చు

క‌రోనా త‌ర్వాత థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయార‌న్న‌ది ఇండ‌స్ట్రీ జ‌నాల‌కు స్ప‌ష్టంగా అర్థ‌మైపోయింది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి సినిమాల‌ను మిన‌హాయిస్తే ఆక్యుపెన్సీ బాగా ప‌డిపోయింది. అందుకు అసాధార‌ణంగా పెరిగిపోయిన టికెట్ల ధ‌ర‌లు కూడా కార‌ణం అని ఒప్పుకుని తీరాల్సిందే.

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్‌-2 లాంటి భారీ చిత్రాల‌కు అప‌రిమిత రేట్లు పెట్టినా వాటి మీద ఉన్న ఆస‌క్తి దృష్ట్యా జ‌నం తిట్టుకుంటూనే చూశారు. కానీ ఆ త‌ర్వాత వ‌చ్చిన సినిమాల మీద త‌మ కోప‌మంతా చూపించేశారు.

పెద్ద సినిమాల‌కు సైతం వీకెండ్లో థియేట‌ర్లు నిండ‌ని ప‌రిస్థితి త‌లెత్తింది. చిన్న‌, మీడియం రేంజ్ సినిమాల పరిస్థితి అయితే ద‌య‌నీయంగా త‌యారైంది. చాలా సినిమాల‌కు స‌రైన‌ ఓపెనింగ్స్ కూడా రాక‌పోవ‌డానికి అధిక టికెట్ల ధ‌ర‌లు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ఇండ‌స్ట్రీ జ‌నాలు కూడా అంగీక‌రించారు.

ఈ నేప‌థ్యంలో మేజ‌ర్, విక్ర‌మ్ లాంటి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న‌ సినిమాల‌కు రేట్లు త‌గ్గించ‌డం ప్ల‌స్ అయింది. అవి మూణ్నాలుగు వారాల పాటు బాగా ఆడాయి. దీన్ని బ‌ట్టి సినిమాలో విష‌యం ఉండి, టికెట్ల ధ‌ర‌లు రీజ‌న‌బుల్‌గా ఉంటే జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని అర్థ‌మైంది.

ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్తులో రాబోయే పెద్ద సినిమాల సంగ‌తేమో కానీ.. మిగ‌తా చిత్రాల‌కు మాత్రం ఇక‌పై ఫిక్స్‌డ్ టికెట్ రేట్లు ఉండ‌బోతున్నాయ‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. తెలంగాణ‌లో హైయ‌ర్ క్లాస్ విష‌యానికి వ‌స్తే సింగిల్ స్క్రీన్ల‌లో 150, మ‌ల్టీప్లెక్సుల్లో 195 రేటు ఇక‌పై ప్ర‌తి సినిమాకూ కొన‌సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఆంధ్రాలో ఆల్రెడీ ప్ర‌భుత్వం రూ.147, రూ.177 రేట్ల‌ను ఫిక్స్ చేసి పెట్టేసింది.

తెలంగాణ‌లో ఏఎంబీ సినిమాస్ మాత్రం ఏ చిత్రానికీ రేట్ త‌గ్గించ‌ట్లేదు. అక్క‌డ రూ.295 రేటు ఫిక్స్ అన్న‌ట్లే. కొన్ని సింగిల్ స్క్రీన్లు రూ.175తో టికెట్లు అమ్ముతున్నాయి. వాటిని మిన‌హాయిస్తే తెలంగాణ‌లో అన్ని థియేట‌ర్లూ పై రేట్ల‌ను మెయింటైన్ చేయ‌బోతున్నాయి. ఈ వారాంతంలో రానున్న బింబిసార‌, సీతారామం చిత్రాల‌కు కూడా ఇవే రేట్లు ఫిక్స‌య్యాయి. భారీ చిత్రాలు వ‌చ్చిన‌పుడు రేట్లు కాస్త పెంచే అవ‌కాశ‌ముంది. అంత వ‌ర‌కు అయితే ఇవే రేట్లు కొన‌సాగ‌బోతున్నాయి.