కేజీఎఫ్‌-2.. సెన్సేష‌న‌ల్ రికార్డ్


కేజీఎఫ్ సీక్వెల్ మీద భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి కానీ.. ఆ చిత్రం రాజ‌మౌళి సినిమా ఆర్ఆర్ఆర్‌ను మించి క‌లెక్ష‌న్లు సాధిస్తుంద‌ని మాత్రం ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఆర్ఆర్ఆర్ ఓవ‌రాల్ వ‌సూళ్లు రూ.1140 కోట్ల ద‌గ్గర ఆగిపోగా.. కేజీఎఫ్‌-2 ఏకంగా రూ.1200 కోట్ల మార్కును దాటేసింది. డివైడ్ టాక్‌తో మొద‌లైన సినిమా ఈ స్థాయి క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌డం అనూహ్యం. ఒక్క హిందీ వెర్ష‌న్ మాత్ర‌మే రూ.450 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్ట‌డం ట్రేడ్ వ‌ర్గాల‌కు పెద్ద షాకే. ఆల్ టైం క‌లెక్ష‌న్ల రికార్డుల్లో ఈ చిత్రానిది మూడో స్థానం.

దంగ‌ల్, బాహుబ‌లి-2 త‌ర్వాత అత్య‌ధిక వ‌సూళ్ల ఘ‌న‌త ఈ చిత్రం పేరు మీదే ఉంది. ఈ చిత్రం ఒక అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది. దేశంలో ఒక మ‌ల్టీప్లెక్స్ ఛైన్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఇండియాలో అత్య‌ధిక స్క్రీన్లు ఉన్న పీవీఆర్ మ‌ల్టీపెక్సుల్లో మాత్ర‌మే రూ.121 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింద‌ట కేజీఎఫ్‌-2. ఇప్ప‌టిదాకా ఇండియాలో ఏ సినిమా కూడా ఒక మ‌ల్టీప్లెక్స్ ఛైన్లో రూ.100 కోట్ల క‌లెక్ష‌న్ల‌ మార్కును కూడా అందుకోలేదు. కేజీఎఫ్‌-2 కంటే ముందు రిలీజైన ఆర్ఆర్ఆర్.. పీవీఆర్‌తో టై అప్ అవ‌డం తెలిసిందే. ఆ చిత్రం ఫుల్ ర‌న్లో పీవీఆర్ మ‌ల్టీప్లెక్సుల్లో రూ.94 కోట్ల దాకా గ్రాస్ క‌లెక్ట్ చేసింది. అది అప్ప‌టికి ఆల్ టైం రికార్డు.

కేజీఎఫ్‌-2 దాని మీద ఇంకో 30 కోట్లు ఎక్కువే క‌లెక్ట్ చేసింది. ఈ సినిమా ఓవ‌రాల్ థియేట్రిక‌ల్ ర‌న్ నెల రోజుల‌కే దాదాపు ముగిసిన‌ప్ప‌టికీ.. పీవీఆర్ స‌హా కొన్ని మ‌ల్టీప్లెక్సుల్లో త‌ర్వాత కూడా కొన్ని షోలు న‌డిచాయి. ఈ చిత్రం 100 రోజుల థియేట్రిక‌ల్ ర‌న్ పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా పీవీఆర్ ఓవ‌రాల్ వ‌సూళ్ల లెక్క‌లు బ‌య‌టికి వ‌చ్చాయి. ఈ సినిమా సాధించిన విజ‌యం చూశాక‌ ప్ర‌శాంత్ నీల్.. కేజీఎఫ్‌-3 తీయ‌డానికి మ‌రింత ఉత్సాహం చూపిస్తాడ‌నడంలో సందేహం లేదు.