హరికృష్ణ వద్దన్నా.. బాలయ్య పట్టుబట్టి


నందమూరి కుటుంబం నుంచి సినీ రంగంలోకి అడుగు పెట్టిన మూడో తరంలో తొలి వ్యక్తి నందమూరి కళ్యాణ్ రామ్. అతను పిల్లాడిగా ఉన్నపుడే ‘బాల గోపాలుడు’ సినిమాతో తెంరగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అది నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం. ఆ సినిమా చేసే సమయానికి కళ్యాణ్ రామ్ ఏడో తరగతి చదువుతున్నాడట. తనను నటుడిగా పరిచయం చేస్తానని బాలయ్యే ప్రతిపాదించగా.. ఆయన సోదరుడు, కళ్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ ఒప్పుకోలేదట. సినిమాల మోజులో పడితే చదువు పాడవుతుందేమో అన్న భయంతో ఆయన వెనుకంజ వేశారట. కానీ బాలయ్య మాత్రం పట్టుబట్టి, అలా ఏమీ జరగదని ఒప్పించి కళ్యాణ్ రామ్‌ను తన సినిమాలో నటింపజేశాడట.

ఈ విషయాన్ని తన కొత్త చిత్రం ‘బింబిసార’ ప్రమోషన్లలో భాగంగా ‘మనసులో మాట’ పేరుతో రిలీజ్ చేసిన ఒక వీడియోలో కళ్యాణ్ రామ్ వెల్లడించాడు. ఇందులో ఈ నందమూరి హీరో తన సినీ ప్రయాణం గురించి వివరించాడు.

‘బాల గోపాలుడు’ చిత్రంతో తాను సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటికీ.. ఆ తర్వాత బాల నటుడిగా మరో సినిమా చేయలేదని, పూర్తిగా చదువు మీదే దృష్టిపెట్టాని.. చదువు పూర్తి చేశాకే ఇటు వైపు అడుగులు వేశానని కళ్యాణ్ రామ్ తెలిపాడు. రామోజీ రావు నిర్మాణంలో కాశీ విశ్వనాథ్ దర్శకుడిగా తాను నటించిన ‘తొలి చూపులోనే’ ఆశించిన ఫలితాన్నివ్వలేదని, రెండో చిత్రం కూడా నిరాశ పరిచిందని, ఆ సమయంలో తన గురించి అందరూ రకరకాలుగా మాట్లాడారని, అప్పుడు తనను తాను నిరూపించుకోవాలన కసి తనలో పెరిగిందని, ఆ క్రమంలో ‘అతనొక్కడే’ చిత్రాన్ని సొంత బేనర్లో నిర్మించానని, అది ఘనవిజయం సాధించి తన కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిందని కళ్యాణ్ రామ్ తెలిపాడు.

‘అతనొక్కడే’ దగ్గర్నుంచి తాను చాలా పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నానని.. హాలీవుడ్లో వచ్చే త్రీడీ సినిమాల స్ఫూర్తితో ఏదైనా కొత్తగా చేయాలని ‘ఓం’ సినిమా చేస్తే అది కూడా తీవ్ర నిరాశకు గురి చేసిందని కళ్యాణ్ రామ్ తెలిపాడు. కొవిడ్ పాండమిక్ తర్వాత ప్రేక్షకులు అసలు థియేటర్లకు వస్తారో రారో అన్న సందేహాలు కలిగిన టైంలో ‘ఆర్ఆర్ఆర్’ ఆ సందేహాల్ని పటాపంచలు చేసిందని.. ఇందులో ఎన్టీఆర్, చరణ్ అద్భుతంగా నటించారని కళ్యాణ్ రామ్ అన్నాడు. ‘బింబిసార’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని అతనన్నాడు. ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.