ఫ్లాప్ త‌ర్వాత ఫ్లాప్.. అయినా సినిమాలే సినిమాలు

సినీ ప‌రిశ్ర‌మలో బ్యాగ్రౌండ్లో వ‌చ్చి హీరోగా నిల‌దొక్కుకోవ‌డం చాలా చాలా క‌ష్టం. అలా వ‌చ్చి నిల‌బ‌డ్డా.. వ‌రుస‌గా కొన్ని ఫ్లాపులు వ‌చ్చాయంటే కెరీర్ డౌన్ అయిపోతుంది. అవ‌కాశాలు త‌గ్గిపోతాయి. కానీ టాలీవుడ్లో ప్ర‌స్తుతం ఓ యువ క‌థానాయ‌కుడు.. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి, ఇప్ప‌టిదాకా నిఖార్స‌యిన హిట్టు ఒక్క‌టీ అందుకోకున్నా.. వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుని దూసుకెళ్తున్నాడు. ఆ హీరో ఎవ‌రో కాదు.. కిర‌ణ్ అబ్బ‌వ‌రం.

రాజావారు రాణివారు అనే చిన్న సినిమాతో ఇత‌ను హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఆ సినిమా థియేట‌ర్ల‌లో స‌రిగా ఆడ‌లేదు. ఓటీటీలో మాత్రం మంచి స్పంద‌న తెచ్చుకుంది. రెండో సినిమా ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పంకి బ్యాడ్ టాక్ వ‌చ్చింది. ఐతే ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌క్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది. ఆపై సెబాస్టియ‌న్ సినిమా అన్ని రకాలుగా నిరాశ ప‌రిచింది. ఇటీవ‌లే రిలీజైన స‌మ్మ‌త‌మే బ్యాడ్ టాక్, ఓ మోస్త‌రు ఓపెనింగ్స్ తెచ్చుకుని వీకెండ్ తిరిగేస‌రికే చాప చుట్టేసింది.

ట్రాక్ రికార్డు ఇలా ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్పుడు కిర‌ణ్ పెద్ద పెద్ద బేన‌ర్ల‌లో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. శుక్ర‌వారం అత‌డి పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఉద‌యం నుంచి కిర‌ణ్ కొత్త సినిమాలకు సంబంధించిన విశేషాల‌తో, అత‌డికి శుభాకాంక్ష‌లు చెబుతున్న పోస్ట‌ర్లు వ‌రుస‌బెట్టి దిగిపోయాయి. గీతా ఆర్ట్స్ బేన‌ర్లో చేస్తున్న విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ‌, కోడి రామ‌కృష్ణ త‌న‌యురాలు కోడి దివ్య నిర్మిస్తున్న నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాల విశేషాల‌ను వాటి మేక‌ర్స్ పంచుకున్నారు.

వీటితో పాటు మీట‌ర్, రూల్స్ రంజ‌న్ అనే రెండు కొత్త సినిమాల‌ను ఈ రోజే ప్ర‌క‌టించారు. ఇవి కాక యువి క్రియేష‌న్స్ బేన‌ర్లో కిర‌ణ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. దాని గురించి ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. మొత్తానికి బ్యాగ్రౌండ్, అలాగే స‌క్సెస్ రేట్ రెండూ లేని హీరో నుంచి ఇన్ని సినిమాలు రాబోతుండ‌టం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.