అంద‌రికీ రిస్కే.. ఎవ్వ‌రూ త‌గ్గ‌ట్లా

జులై నెల టాలీవుడ్‌కు వ‌రుస‌గా చేదు అనుభ‌వాలే మిగులుస్తోంది. ప్ర‌తి వారం కొత్త సినిమాల మీద ఆశ‌లు పెట్టుకోవ‌డం.. అవి నిరాశ ప‌ర‌చ‌డం మామూలైపోయింది. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్, హ్యాపీ బ‌ర్త్ డే, వారియ‌ర్.. ఇలా ప్ర‌తి వారం అంచ‌నాలు పెట్టుకున్న సినిమాల‌న్నీ నిరాశ‌కే గురి చేశాయి. మిగ‌తా సినిమాల గురించైతే చెప్పాల్సిన పనే లేదు. ఇక వ‌చ్చే వారం రాబోతున్న థ్యాంక్ యు సినిమా సంగ‌తేంటో చూడాలి. ఆ సినిమా సంగ‌త‌లా ఉంచితే.. ఆగ‌స్టు తొలి వారం రిలీజ‌య్యే సినిమాల విష‌యంలో ఉత్కంఠ నెల‌కొంది.

ఆ నెల‌లో తొలి శుక్ర‌వారం విడుద‌ల కోసం తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. మామూలుగా ఆగ‌స్టులో ఇండిపెండెన్స్ డే వీకెండ్ కోసం పోటీ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఆగ‌స్టు ఫ‌స్ట్ వీకెండ్ కోస‌మే కొట్టేసుకుంటున్నారు. ఆ వీకెండ్‌కు షెడ్యూల్ అయిన మూడు సినిమాలకు సంబంధించిన ముఖ్యుల‌కు స‌క్సెస్ అనేది చాలా అవ‌స‌రం. వాళ్ల కెరీర్లే ఈ సినిమాల మీద ఆధార‌ప‌డి ఉన్నాయి. ఇలాంటి స‌మ‌యంలో సేఫ్ టైమింగ్ చూసుకోకుండా రిస్క్‌కు రెడీ అవుతున్నారు.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ సినిమా బింబిసార‌ను ఆగ‌స్టు 5వ తేదీకి షెడ్యూల్ చేసిన సంగ‌తి తెలిసిందే. కెరీర్లో అత‌ను చూడ‌ని అప్ అండ్ డౌన్స్ లేవు. ఎంత‌మంచివాడ‌వురా పెద్ద డిజాస్ట‌ర్ కావ‌డంతో చాలా గ్యాప్ తీసుకుని అత‌ను బింబిసార చేశాడు. కొత్త ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ్‌ను న‌మ్మి భారీ బ‌డ్జెట్లో ఈ సినిమాను నిర్మించాడు. రిజ‌ల్ట్ అటు ఇటు అయితే క‌ళ్యాణ్ రామ్ కోలుకోవ‌డం క‌ష్టం. ఇక మ‌రో యంగ్ హీరో నిఖిల్ కెరీర్లో అత్య‌ధిక బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా కార్తికేయ‌-2. నిర్మాత‌లు, అలాగే ట్రేడ్ ఈ సీక్వెల్‌ను న‌మ్మి భారీ పెట్టుబ‌డులే పెట్లింది. ఈ నెల 22నే రావాల్సిన ఈ చిత్రం అనివార్య కార‌ణాల‌తో వాయిదా ప‌డి ఆగ‌స్టు 5కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. నిఖిల్, చందు మొండేటిల కెరీర్ల‌కు ఈ సినిమా చాలా కీల‌కం.

ఇక ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి కెరీర్‌ను డిసైడ్ చేసే సినిమాగా సీతారామంను చెప్పొచ్చు. వ‌రుస డిజాస్ట‌ర్ల త‌ర్వాత కూడా అత‌డికి పెద్ద బ‌డ్జెట్లో ఈ సినిమా చేసే అవ‌కాశం ద‌క్కింది. ఈ చిత్రం ఆగ‌స్టు 5నే రావాల్సి ఉంది. ఈ చిత్రం తెలుగులో గుర్తింపు కోసం చూస్తున్న దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్‌ల‌కూ కీల‌క‌మే. మ‌రి ఇంత‌మంది కెరీర్ల‌తో ముడిప‌డ్డ సినిమాలు మూడు ఒకేసారి రిలీజ‌వ‌డం దేనికీ మంచిది కాదు. కానీ ఎవ్వ‌రూ త‌గ్గ‌కుండా అదే రోజు రిలీజ్‌కు రెడీ అయిపోతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.