రామ్ మెడకు లింగుస్వామి గొడవ

చాలామంది స్టార్ల లాగే తెలుగు రాష్ట్రాల అవ‌త‌ల మార్కెట్ సంపాదించాల‌ని అనుకున్నాడు రామ్. అందుకే త‌మిళంలో పెద్ద ద‌ర్శ‌కుల్లో ఒక‌డైన లింగుస్వామితో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ది వారియ‌ర్ మూవీ చేశాడు. లింగుస్వామికి త‌మిళంలో మంచి పేరే ఉంది. అక్క‌డాయ‌న ర‌న్, పందెంకోడి, ఆవారా, వేట్టై లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్లు ఇచ్చాడు. లింగుస్వామికి త‌మిళంలో ఉన్న పేరుకు తోడు ఆది పినిశెట్టి, న‌దియా లాంటి అక్క‌డి వాళ్ల‌కు ట‌చ్ ఉన్న ఆర్టిస్టులు, దేవిశ్రీ ప్ర‌సాద్ లాంటి టెక్నీషియ‌న్ల‌ను పెట్టుకుని అంతా బాగానే సెట్ చేసుకున్నారు. సినిమాను త‌మిళంలో బాగా ప్ర‌మోట్ చేశారు కూడా. ప్రి రిలీజ్ ఈవెంట్ అదీ చాలా గ్రాండ్‌గా జ‌రిగింది. అంతా బాగా చేసి సినిమా విడుద‌ల‌కు సిద్ధం అయ్యాక ఇప్పుడు పెద్ద షాక్ త‌గిలింది.

ఈ గురువారం ది వారియ‌ర్ మూవీ త‌మిళంలో రిలీజ్ కావ‌డం అనుమానంగా మారింది. ముందు రోజు రాత్రి కూడా అక్క‌డ బుకింగ్స్ ఓపెన్ కాక‌పోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం.

లింగుస్వామి గ‌తంలో పెద్ద హిట్లే ఇచ్చాడు కానీ.. గ‌త ప‌దేళ్ల‌లో ఆయ‌న ట్రాక్ రికార్డు పేల‌వం. సూర్య‌తో తీసిన సికింద‌ర్, విశాల్‌తో చేసిన పందెంకోడి-2 డిజాస్ట‌ర్ల‌య్యాయి. వీటిలో లింగుస్వామి నిర్మాణ భాగ‌స్వామి కూడా. ఆయ‌న బేన‌ర్ తిరుప‌తి బ్ర‌ద‌ర్స్‌లో వేరే సినిమాలు కూడా నిర్మించాడు లింగుస్వామి. అవి కూడా దెబ్బ కొట్టాయి. ఫైనాన్షియ‌ర్ల‌కు చెల్లింపులు చేయాల్సి ఉంది. అవి పెండింగ్‌లో పెట్టి త‌న కొత్త సినిమా ది వారియ‌ర్‌ను రిలీజ్‌కు రెడీ చేయ‌గా.. స‌రిగ్గా విడుల‌ల‌కు ముందు ఫైనాన్షియ‌ర్లు అడ్డం ప‌డ్డారు. ఈ గొడ‌వ న‌డుస్తుండ‌డంతో ఎగ్జిబిట‌ర్లు బుకింగ్స్ ఓపెన్ చేయ‌లేదు.

ఇలా ఫైనాన్స్ వివాదాల‌తో సినిమాల రిలీజ్ వాయిదా ప‌డ‌డం, ఆల‌స్యం కావ‌డం మామూలే. నిజానికి ఈ సినిమాకు లింగుస్వామి ద‌ర్శ‌కుడు మాత్ర‌మే అయిన‌ప్ప‌టికీ.. త‌మిళంలో బిజినెస్ అంతా కూడా ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే జ‌రిగింది. ఫైనాన్షియ‌ర్లు ఇంత‌కుమించిన అవ‌కాశం రాద‌ని భావించి ఇప్పుడే అడ్డం ప‌డ్డారు. మ‌రి అడ్డంకుల్ని అధిగ‌మించి ఈ సినిమా త‌మిళంలో స‌జావుగా రిలీజ‌వుతుందేమో చూడాలి.